పద్మారావునగర్, వెలుగు: మూసీ నిర్వాసితుల అంశంపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో ముందస్తు సమాచారం, చట్టబద్ధమైన పునరావాసం లేకుండా ఇండ్ల కూల్చివేతలు చేపట్టడం, పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనా నివేదికలు లేకపోవడం వంటి అంశాలపై హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ప్రాజెక్టు వల్ల వందలాది వృక్షాలు, వారసత్వ కట్టడాలు దెబ్బతింటున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక కోరింది.
