‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాకతో కలిసి ఆమె నిర్మించిన ఈ సినిమా 72వ నేషనల్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ మేకప్ విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిహారిక మాట్లాడుతూ ‘మా చిత్రానికి జాతీయ అవార్డులు రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణం.
ఈ సినిమాను నిర్మించడం నా కెరీర్‌లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఈ విజయం టీమ్ మొత్తం పడ్డ కష్టానికి దక్కిన గుర్తింపు. మా కుటుంబం తర్వాత ఇప్పుడు నా సినిమా కూడా జాతీయ అవార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.
ఈ సినిమా జాతీయ అవార్డు గెలుస్తుందని మొదటి నుంచే నమ్మకం ఉందని దర్శకుడు యదు వంశీ చెప్పాడు. నిర్మాత ఫణి అడపాక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ సహా టీమ్ అంతా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
