హైదరాబాద్, వెలుగు: నడకను దెబ్బతీసి తీవ్ర వైకల్యం, పక్షవాతానికి దారితీసే సంక్లిష్ట మెడ, ఛాతీ భాగాల వెన్నెముక సమస్యలకు నిమ్స్ లో అత్యాధునిక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రభావంతో పాటు సర్వైకల్ స్పాండిలోసిస్, ఓపీఎల్ఎల్, ఓవైఎల్ సమస్యల వల్ల లిగమెంట్లు ఎముకలా మారి వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, నడకలో తూలడం వంటి సమస్యలు వస్తుంటాయి.
గతంలో వీటికి పెద్ద కోతలతో ఓపెన్ సర్జరీలు చేయాల్సి రాగా, ప్రస్తుతం ఇక్కడ యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (యూబీఏ) పద్ధతిని వాడుతున్నారు. ఇందులో కేవలం అర సెంటీమీటర్ పరిమాణంలో 2 చిన్న కోతలు పెట్టి, హై-డెఫినిషన్ కెమెరా, స్పెషల్ ఎక్విప్మెంట్ సాయంతో వెన్నుపాముపై ఒత్తిడి కలిగించే లిగమెంట్ ను తొలగిస్తున్నారు.
