నిమ్స్ లో స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్..డ్యామేజ్ లివర్ ను సాధారణ స్థితికి తెచ్చే చాన్స్

నిమ్స్  లో స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్..డ్యామేజ్ లివర్ ను సాధారణ స్థితికి తెచ్చే చాన్స్
  • ఆపరేషన్ లేకుండానే లివర్ రీజెనరేటింగ్
  • ఎలుకలపై ప్రయోగంలో 100 శాతం సక్సెస్ 
  • ప్రపంచంలోనే తొలిసారిగా పీపీపీ పద్ధతిలో నిమ్స్​లో ఏర్పాటు 
  • ఇవాళ(జవనరి 19)సెంటర్​ను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: పేదోడి కార్పొరేట్ హాస్పిటల్ గా పేరున్న నిజాం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో వైద్య విప్లవానికి వేదికైంది. లివర్ పూర్తిగా పాడైపోయి.. బతుకుపై ఆశలు వదులుకున్న పేషెంట్లకు స్టెమ్ సెల్ (మూలకణ) థెరపీతో పునర్జన్మ ప్రసాదించేందుకు సిద్ధమైంది. 

ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించనున్నారు. సాధారణంగా ఇలాంటి అత్యాధునిక  రీసెర్చ్ లు విదేశాల్లోనో.. బడా ప్రైవేట్ ల్యాబ్​లలోనో జరుగుతాయి. కానీ, ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో.. ప్రైవేట్ బయోటెక్ కంపెనీ తులసి థెరప్యూటిక్స్ తో కలిసి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్ పద్ధతిలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం విశేషం.

ఎలుకలపై ప్రయోగం సక్సెస్..

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అమెరికా నుంచి అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ టెక్నాలజీని హైదరాబాద్ కు రప్పించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని ఆస్పైర్ బయోనెస్ట్ కేంద్రంగా తులసి థెరప్యూటిక్స్ సైంటిస్టులు గత మూడేండ్లుగా దీనిపై రీసెర్చ్ చేశారు. మనుషుల్లో మద్యం ఎక్కువగా తాగితే లివర్ గట్టిపడిపోయి సిర్రోసిస్ ఎలా వస్తుందో.. కొన్ని ఎలుకలకు కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే కెమికల్ ఇచ్చి ఆర్టిఫిషియల్ గా అలాంటి పరిస్థితిని కల్పించారు. 

అనంతరం ఆ ఎలుకలకు సెలైన్ ద్వారా హ్యూమన్ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ (పురిటి సమయంలో సేకరించిన బొడ్డు తాడు కణాలు), ఎక్సోసోమ్స్ అనే మందును ఎక్కించారు. ఈ చికిత్స తీసుకోని ఎలుకల్లో సగం చనిపోగా, స్టెమ్ సెల్ మందు తీసుకున్న ఎలుకలు మాత్రం 100 శాతం బతికాయి. 

అంతేకాదు, గట్టిపడిపోయిన వాటి లివర్ కణాలు తిరిగి మెత్తగా మారి, సాధారణ స్థితికి చేరుకున్నాయి. లివర్ పనితీరు కూడా నార్మల్ అయ్యింది. ప్రస్తుతం నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్న సెంటర్ ద్వారా  మనుషుల్లోనూ ఈ పరిస్థితిని తీసుకొచ్చేందుకు పరిశోధనలు చేయనున్నారు. ఇది సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే కొత్త రివల్యూషన్ అందుబాటులోకి రానున్నది.  

తప్పనున్న ట్రాన్స్‌‌‌‌ ప్లాంట్ తిప్పలు..  

ప్రస్తుతం లివర్ సిర్రోసిస్ బారిన పడితే లక్షల రూపాయలు ఖర్చు చేసి లివర్ మార్పిడి చేసుకోవడం ఒక్కటే మార్గం. పైగా డోనర్స్ దొరకడం కూడా కష్టమే. కానీ, నిమ్స్ తెస్తున్న ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే పెద్ద ఆపరేషన్ల అవసరం ఉండదు. స్టెమ్ సెల్స్ ను బాడీలోకి ఎక్కిస్తే చాలు.. అవి దెబ్బతిన్న భాగాన్ని వాటంతట అవే రిపేర్ చేస్తాయి. భవిష్యత్తులో లివర్ ఫెయిల్యూర్ కు ఇదే బెస్ట్ సొల్యూషన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అత్యాధునికమైన స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ను అతి తక్కువ ఖర్చుతోనే పేదలకు అందించాలన్న మంత్రి దామోదర రాజనర్సింహ విజన్ వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైందని తులసి థెరప్యూటిక్స్ సీఈవో డాక్టర్ సాయిరాం అట్లూరి తెలిపారు. ఈ రీసెర్చ్ సెంటర్ కేవలం లివర్ సమస్యలకే పరిమితం కాదు. 

భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్, పక్షవాతం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కీళ్ల నొప్పులు వంటి వాటికి కూడా ఇక్కడ స్టెమ్ సెల్ చికిత్స అందుబాటులోకి  తీసుకురానున్నారు.