ఏడేండ్లయినా ఆ బస్టాప్‌‌ మారలె

ఏడేండ్లయినా ఆ బస్టాప్‌‌ మారలె

నిర్భయ ఘటన జరిగిన 
బస్టాపంటే ఇంకా భయమే
రాత్రి 9 దాటిందంటే పోకిరీలకు అడ్డాగా మునిర్కా స్టాప్‌‌

నిర్భయ’ ఘటన జరిగి ఏడేండ్లు కావొస్తోంది. ఆ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం కచ్చితమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. నగరంలో సీసీటీవీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పారు. బస్సులకు జీపీఎస్‌‌ సిస్టమ్‌‌ ఫిట్‌‌ చేయిస్తామన్నారు. ఆకతాయిలపై నిఘా పెడతామన్నారు. ఢిల్లీ సంగతి దేవుడెరుగు.. నిర్భయ ఘటన జరిగిన బస్టాప్ దగ్గరనే పరిస్థితులు ఇంకా మారలేదు. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా బస్టాప్ దగ్గర ఇప్పటికీ నిఘా సక్కగ లేదు. బస్టాప్‌‌ పోకిరీలకు అడ్డాగా మారిందని మహిళలు వాపోతున్నారు. వాళ్ల వెకిలి చేష్టలు, పిచ్చి పిచ్చి కామెంట్లతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. చట్టాల్లోనైతే మార్పులు చేశారు గాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదని చెబుతున్నారు.

మునిర్కా అంటేనే  భయం

‘నేను పని మీద ఢిల్లీ అంతా తిరుగుతాను. దానికి నా పేరెంట్స్‌‌ అంత భయపడరు. కానీ పని అయిపోయి మునిర్కాకు వస్తున్నానంటే మాత్రం భయపడిపోతారు’ అని మునిర్కాలో ఉండే ఓ యువతి చెప్పారు. బస్టాండ్‌‌కు వచ్చాక తనను ఇంటికి తీసుకెళ్లడానికి పేరెంట్స్‌‌ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారని, ఇంకా ఇక్కడ పరిస్థితేం మారలేదని అన్నారు. రాత్రి 9 దాటితే బస్టాప్‌‌ అకతాయిలకు అడ్డాగా మారుతుందని, స్టాప్‌‌లో దిగాక వాళ్లను తప్పించుకొని బయటకు రావడం చాలా కష్టమని గ్రీన్‌‌పార్క్‌‌లో బ్యుటీషియన్‌‌గా పని చేసే 27 ఏళ్ల రాణి కుమారి చెప్పారు. ‘పనైపోయాక మునిర్కాకు బస్‌‌లో వస్తా. అప్పటికే అక్కడ చాలా ఆటోలు ఉంటాయి. ఇంటి దగ్గర దింపడానికి రమ్మంటే ఎవ్వరూ రానంటారు. పని చేసి అలసి పోయామంటారు. కానీ నీచంగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడానికి మాత్రం అలసిపోరు. కాలినడకన వెళ్తుంటే వెనకాలే వస్తూ అసభ్యంగా మాట్లాడుతుంటారు’ అని వాపోయారు.

సర్కారు మస్తు చెప్తది.. కానీ!

‘మహిళలను ఆటో డ్రైవర్లు ఇంటి దగ్గర దిగబెట్టడానికి నో చెబితే ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం చెప్తోంది. అదే  ధైర్యంతో ఓ రోజు రాత్రి బస్టాప్‌‌ దగ్గరున్న ఆటో ఎక్కి కూర్చున్నా. ఇంటి దగ్గర దించమని చెప్పా. దించనంటే  పోలీస్‌‌లకు కంప్లైంట్‌‌ చేస్తానని హెచ్చరించా’ అని  35 ఏళ్ల మీనా చెప్పారు. కానీ డ్రైవర్ మాత్రం ఆటోలో సీఎన్‌‌జీ లేదని చెప్పాడని, అతను అబద్దం చెబుతున్నట్టు తనకు అర్థమైనా చేసేదేం లేక చీకట్లోనే నడుచుకుంటూ ఇంటికెళ్లానని చెప్పారు.