క్షమాభిక్ష పిటిషన్ విత్ డ్రా చేసుకున్న దోషి
కేసులో లీగల్ ఆప్షన్లు పూర్తి
నలుగురికి శిక్ష అమలే మిగిలింది
ఈనెల 16తో ఢిల్లీ ఘోరానికి ఏడేండ్లు
నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో శిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. మరణశిక్ష పడకుండా క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి చేసుకున్న పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు దోషి వినయ్ శర్మ శనివారం లెటర్ రాశాడు.అసలు తాను మెర్సీ పిటిషన్ పెట్టలేదని అందులో రాశాడు. తన పేరుతో వచ్చిన పిటిషన్ లో తాను సంతకం చేయలేదని పేర్కొన్నాడు. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాశాడు. దీంతో ఈ కేసులో లీగల్ గా ఉన్న అన్ని ఆప్షన్లనూ నిందితులు పూర్తిచేసుకున్నట్లైంది. మరణశిక్షల కేసుల్లో అన్ని అప్పీళ్ల తర్వాత చివరిగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి నిందితులకు అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తయితే రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి శిక్షను అమలు చేస్తారు. క్షమాభిక్షను ఆమోదిస్తే యావజ్జీవ శిక్షగా మారుస్తారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల్లో ముగ్గురు అసలు క్షమాభిక్షను కోరలేదు. వినయ్ శర్మ ఒక్కడి పేరుతోనే అప్లికేషన్ రావడంతో శిక్షల అమలు పెండింగ్ లో పడింది. హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వినయ్ శర్మ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని సమర్థిస్తూ శుక్రవారమే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందే వినయ్ శర్మ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం విశేషం.
శిక్ష అమలు ఎప్పుడు?
వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుందన్న ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి. నిర్భయ కేసు విషయంలోనూ ఇకనైనా న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రులు, ప్రజలు కూడా డిమాండ్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు దేశం దృష్టి ఈ కేసుపైనే పడింది. లీగల్ గా అన్ని అడ్డంకులూ పూర్తవడం వల్ల త్వరలోనే ఉరిశిక్షలను అమలు చేస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నెల 16తో నిర్భయ ఘటనకు ఏడేళ్లు పూర్తి కానున్నాయి.
