ఈ20 పెట్రోల్ వాడితే రబ్బరు పార్ట్స్ మార్చాలి... 2016కు ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య: నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్ వాడితే రబ్బరు పార్ట్స్ మార్చాలి... 2016కు ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య: నితిన్ గడ్కరీ
  • ఈ20 పెట్రోల్ ఆందోళనలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ
  • సమగ్ర పరిశీలన తర్వాతే ఈ20 పెట్రోల్ తీసుకొచ్చామని వెల్లడి

న్యూఢిల్లీ: ఇథనాల్20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు పరికరాలు మార్చుకోవాల్సి రావొచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ20 పెట్రోల్ వాడకంపై జరుగుతున్న ప్రచారంతో వాహనదారుల్లో నెలకొన్న సందేహాలపై మంత్రి స్పందించారు. ఈమేరకు బుధవారం రాజ్యసభలో ఈ20 పెట్రోల్ విషయంలో నెలకొన్న గందరగోళంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఈ20 పెట్రోల్ వాడకంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఐపీ డెహ్రాడూన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్షరర్స్ (ఎస్‌‌‌‌ఐఏఎం), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) పరిశోధనలు నిర్వహించాయని చెప్పారు. ఈ పరిశోధనల ప్రకారం.. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి ముప్పు లేదని తేలిందన్నారు. పాత బైక్స్, కార్లకు ఇంజన్ లో భారీ మార్పులు చేయాల్సిన అవసరమూ లేదని తేల్చాయన్నారు. వాహనాల పనితీరుపై ఇది దుష్ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. 

2005 లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన కొన్ని బీఎస్ 3 వాహనాల్లో, 2016 కన్నా ముందు తయారైన వాహనాల విషయంలో కొన్ని రబ్బర్ పార్ట్స్ మాత్రం మార్చుకోవాల్సి ఉంటుందని మంత్రి గడ్కరీ తెలిపారు. వాహనాలకు నిర్వహించే సాధారణ సర్వీసింగ్ సమయంలో ఈ పరికరాలను మార్చుకోవచ్చని, ఈ స్వల్ప మార్పులు చేస్తే ఈ20 పెట్రోల్ తో మరే ఇతర ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.

మైలేజీ తగ్గిపోవడంపై ఏమన్నారంటే..

ఈ20 పెట్రోల్ తో వాహనాల మైలేజీ తగ్గిపోతుందని జరుగుతున్న ప్రచారంపైనా మంత్రి స్పందించారు. వాహనాల తయారీ సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతీ వాహనం ఎంత మైలేజీ ఇస్తుందనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం ఈ20 పెట్రోల్ వల్లే మైలేజీ తగ్గిందనడం సరికాదని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీ, నీతి అయోగ్ ఇచ్చిన రిపోర్టు కూడా ఇండియన్ ఆయిల్, ఏఆర్ఏఐ, ఎస్ఐఏఎంల నివేదికలోని వివరాలనే వెల్లడించిందన్నారు. 

సాధారణ పెట్రోల్​తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనం పనితీరు, మైలేజీ, ఇంజన్ క్యాలిబరేషన్, ఫ్యూయెల్ సిస్టం సహా ఇతరత్రా అంశాలలో కలిగే మార్పులను పరిశీలించి, నిపుణులతో చర్చించాకే కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఈ రిపోర్టును ‘రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020–25’ పేరుతో 2021 జూన్​లోనే.. అంటే, దేశంలో అప్పటికి ఈ20 పెట్రోల్​ను ప్రవేశపెట్టకముందే రిలీజ్ చేసిందన్నారు.

‘ప్రాంతాల వారీగా, క్రమబద్ధమైన, శాస్త్రీయంగా ధృవీకరణ, సంప్రదింపుల ఆధారిత’ విధానం ద్వారా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమాన్ని అమలు చేసినట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా మరింత ఎక్కువ ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగిస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఒక శతాబ్దానికి పైగా వాడుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.