బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం

ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలని పిలుపు

పాట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని గురువారం పిలుపునిచ్చారు. ‘‘ప్రత్యేక హోదా అనేది బీహార్​కే పరిమితం చేయం. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను గుర్తించి అన్నింటికీ స్పెషల్​ స్టేటస్​ ఇస్తాం” అని నితీశ్​ కుమార్​ అన్నారు. ‘‘ఇతర పార్టీల నుంచి ప్రజలను దూరం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో దేశమంతా చూస్తోంది. అందుకు వాళ్లు ఎలాంటి మార్గాన్ని ఉపయోగిస్తున్నారో కూడా అందరికీ తెలుసు” అని గోవాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు నితీశ్​ జవాబు ఇచ్చారు. వేల కోట్లు చేతులు మారుతున్నాయని ప్రస్తావించకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేశారు. 

10 లక్షల ఉద్యోగాలిస్తేనే: ప్రశాంత్​ కిశోర్​

ఏడాది కాలంలో సీఎం నితీశ్​ కుమార్​ రాష్ట్రంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని, అప్పుడే బీహార్‌‌‌‌‌‌‌‌లో నితీశ్​తో లేదా కూటమితో కలిసి పని చేసే విషయం గురించి ఆలోచిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మధ్యం నిషేధ ఉద్యమం విఫలమైందని, దీనిపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మద్య నిషేధం అమలు కాగితాలకే పరిమితమైందని, విచ్చలవిడి అవినీతే దీనికి కారణమని ఆరోపించారు. తన 3,500 కిలోమీటర్ల ‘పాద-యాత్ర’లో భాగంగా.. బీహార్​ను మొత్తం కవర్​ చేసేందుకు నితీశ్​ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. సీక్రెట్​గా ఆయనను కలిసినట్టు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. రెండ్రోజుల కింద భేటీ అయ్యామని చెప్పారు. తమ కామన్​ ఫ్రెండ్​ పవన్​ వర్మ ఈ మీటింగ్​ అరేంజ్​ చేశారని వెల్లడించారు.  బీహార్​లో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన సమస్యలను నితీశ్​కు వివరించినట్టు తెలిపారు.

బీజేపీతో పొత్తు.. పొరపాటు

బీజేపీతో పొత్తు పెట్టుకుని పెద్ద పొరపాటు చేశానని, సీఎం హోదాలో ఉన్న తనను ఆ పార్టీ నేతలు అవమానించారని అన్నారు. ముఖ్య లీడర్లే బాధ్యతలేనట్లు ప్రవర్తించారని  మండిపడ్డారు. స్థానిక బీజేపీ నేతలు కేంద్రం మెప్పు పొందేందుకు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. రెండ్రోజుల కింద బెగుసరాయ్​ కాల్పుల ఘటనను ఉద్దేశిస్తూ.. బీహార్​లో జనతా రాజ్​ పోయిందని, జంగిల్​ రాజ్​ వచ్చిందని కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు.