హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వివిధ బోర్డుల నిర్ణయాలపై కాలేజీలు చేసుకునే అప్పీళ్లకు ఆన్లైన్ అప్పీల్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ-మెయిల్ , ఇతర మార్గాల్లో అప్పీళ్లకు చాన్స్లేదు. కేవలం application.nmc.org.in/login వెబ్ సైట్ ద్వారానే అభ్యంతరాలు దాఖలు చేయాలని ఎన్ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లంగర్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా 2026-–27 అకాడమిక్ ఇయర్ కు దరఖాస్తు చేసుకున్న సంస్థలు, పాత లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారానే ఈ పోర్టల్ లో లాగిన్ కావొచ్చని, ప్రతి అప్పీల్ కు మొత్తం జీఎస్టీతో కలిపి రూ. 59,000 ఫీజు ఆన్ లైన్ లో లేదా ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించాలని చెప్పారు. షోకాజ్ నోటీసులు, ఇన్స్పెక్షన్ రిపోర్టులను అటాచ్ చేయాలని, అసంపూర్తిగా లేదా తప్పుగా పంపే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ హెచ్చరించింది.
