వైకల్య శాతంతో అర్హత నిర్ధారించొద్దు..ఎంబీబీఎస్ ప్రవేశాల్లో దివ్యాంగులకు ఎన్ఎంసీ బిగ్ రిలీఫ్

వైకల్య శాతంతో అర్హత నిర్ధారించొద్దు..ఎంబీబీఎస్ ప్రవేశాల్లో దివ్యాంగులకు ఎన్ఎంసీ బిగ్ రిలీఫ్

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు పొందే దివ్యాంగ (పీడబ్ల్యూడీ) అభ్యర్థుల అర్హతను కేవలం యూడీఐడీ కార్డ్‌‌‌‌ లో నమోదైన వైకల్య శాతం, కేటగిరీ ఆధారంగా మాత్రమే నిర్ధారించవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు 2026 ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ‘దివ్యాంగుల ప్రాథమిక అంచనా మార్గదర్శకాలను’ ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ సోమవారం విడుదల చేశారు. 

కొత్త రూల్స్ ప్రకారం.. కనీసం 40 శాతం వైకల్యం ఉన్న అభ్యర్థులు రిజర్వేషన్‌‌‌‌ కు అర్హులైనప్పటికీ, వారి ఎంబీబీఎస్ ప్రవేశ అర్హతను కేవలం సంఖ్యాత్మక శాతంతో కాకుండా సదరు విద్యార్థికి ఉన్న ఫంక్షనల్ కాంపిటెన్సీ, అసిస్టివ్ టెక్నాలజీ, రీజనబుల్ అకామిడేషన్, రోగుల భద్రత ప్రాతిపదికన బోర్డులు స్వతంత్రంగా అంచనా వేయాలని సూచించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న అసెస్‌‌‌‌మెంట్ సెంటర్లను 16 నుంచి 61కి విస్తరించామని, డిసిగ్నేటెడ్ మెడికల్ అసెస్‌‌‌‌మెంట్ బోర్డులు ఇకపై సాధారణ డిసేబిలిటీ సర్టిఫికెట్ కు బదులుగా అభ్యర్థి విద్యాభ్యాస సామర్థ్యాన్ని ధ్రువీకరించే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ను జారీ చేస్తాయని పేర్కొన్నారు. 

కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) కరికులమ్‌‌‌‌ కు అనుగుణంగా అభ్యర్థులు అవసరమైన వైద్య నైపుణ్యాలను పొందగలరా? లేదా? అనేదే ప్రాథమిక అంశంగా పరిగణిస్తారు. వినికిడి, దృష్టి, శారీరక చలన, మానసిక లేదా అభ్యాస వైకల్యాలు ఉన్న అభ్యర్థులు షెడ్యూల్-1 కింద పేర్కొన్న ఫార్మాట్‌‌‌‌లో స్వయం ధ్రువీకరణ అఫిడవిట్లను సమర్పించాల్సి ఉంటుంది. సహాయక పరికరాలు, తగిన సదుపాయాలు కల్పించిన తర్వాత కూడా అభ్యర్థి ఎంబీబీఎస్‌‌‌‌కు కావలసిన నైపుణ్యాలను సాధించలేరని,  రోగుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని నిరూపితమైతే తప్ప ఎవరినీ అనర్హులుగా ప్రకటించకూడదని ఎన్ఎంసీ ఆదేశించింది.