యూపీలోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు. విధ్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ఆజంఖాన్ కు మూడేండ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దీంతో అతని పై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. 1977 తర్వాత తొలిసారి రాంపూర్ నుంచి ఆజాంఖాన్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 45 ఏండ్లలో తొలిసారి ఆజంఖాన్ కుటుంబ సభ్యులు రాంపూర్ బరి నుంచి పోటీ చేయకపోవడం గమనార్హం.
రాంపూర్ బరిలో ఎస్పీ అభ్యర్థిగా ఆజాంఖాన్ విధేయుడు అసిమ్ రజాకు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఆజాంఖాన్ కుటుంబ సభ్యులు ఎవరూ బరిలోకి దిగలేదు. 1977 నుంచి రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆజంఖాన్ పోటీ చేస్తూ వస్తున్నారు. 1977 నుంచి 2022 వరకు 12 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆజంఖాన్ , అతని కుటుంబ సభ్యులు పోటీ చేశారు. ఇక్కడి నుంచి పది సార్లు విజయం సాధించగా..రెండు సార్లు మాత్రం ఓడిపోయారు.
2019 లో ఆజంఖాన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన భార్య తజీన్ ఫాత్మా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు అసిమ్ రజా రాంపూర్ ఉప ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1980 నుంచి 1993 మధ్య కాలంలో ఆజంఖాన్ వరుసగా ఐదుసార్లు గెలిచారు. 1996లో అప్రోజ్ అలీఖాన్ చేతిలో ఓడిపోవడంతో ఆజంఖాన్ ను రాజ్యసభకు పంపించారు. తర్వాత 2002 నుంచి 2022 వరకు జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఆకాష్ సక్సేనా మరోసారి బరిలోకి దిగారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

