EWS రిజర్వేషన్ల రూల్స్​లో మార్పుల్లేవ్

EWS రిజర్వేషన్ల రూల్స్​లో మార్పుల్లేవ్
  • సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

న్యూఢిల్లీ: నీట్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రూల్స్ లో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేయడంలేదని కేంద్రం వెల్లడించింది. రూ.8 లక్షల ఇన్ కమ్ లిమిట్​ను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. ప్రస్తుతం నీట్ పీజీ అడ్మిషన్ల ప్రాసెస్ జరుగుతున్న టైమ్ లో రూల్స్ మారిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అందులో పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి రూల్స్ మారుస్తామని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ కోటా రూల్స్ కు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒకే ఇన్ కమ్ లిమిట్ ను ఎలా అమలు చేస్తారని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దీంతో ఈ వివాదంపై కేంద్రం త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ డిసెంబర్ 31న కేంద్రానికి రిపోర్టు ఇచ్చింది. 
కమిటీ సిఫార్సులకు ఓకే... 
త్రీ మెన్ కమిటీ సిఫార్సులకు అంగీకరిస్తున్నామని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. ‘‘ప్రస్తుతమున్న రూ.8 లక్షల ఇన్ కమ్ లిమిట్ ను కొనసాగించాలని కమిటీ చెప్పింది. ఇన్ కమ్ తో సంబంధం లేకుండా ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న స్టూడెంట్లు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది” అని చెప్పింది. అయితే ఈ సిఫార్సులు ఈ ఏడాది అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కాగా, రూ.8 లక్షల ఇన్ కమ్ లిమిట్ ను కేంద్రం మరోసారి సమర్థించుకుంది. దీనివల్ల ఇప్పటి వరకు ఎవరూ నష్టపోలేదంది. ఈ అంశంపై ఈ నెల 6న విచారణ జరగనుంది.