మార్కెట్ విలువలే సవరించాం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచట్లేదు : మంత్రి పొంగులేటి 

మార్కెట్ విలువలే సవరించాం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచట్లేదు : మంత్రి పొంగులేటి 
  •  ప్రజాకోణంలోనే శాస్త్రీయంగా భూముల విలువ సవరణ: మంత్రి పొంగులేటి 
  •  ఫ్యూచర్ సిటీ రద్దు సాధ్యం కాదుసబ్ రిజిస్ట్రార్లు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు
  • అభ్యంతరాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు
  • ఏ శాఖ ఇచ్చినా కళ్లు మూసుకొని పనిచేస్త
  • మీడియాతో చిట్ చాట్ లో రెవెన్యూ మంత్రి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించామని, అయితే రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని, ఒక్క శాతం పెంచినా ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందనే ఉద్దేశంతోనే తాము చార్జీలుపెంచలేదన్నారు. ప్రజాకోణంలో ఆలోచించి, వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను మాత్రమే సవరించినట్లు వెల్లడించారు. గురువారం సెక్రటేరియెట్​లో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్​చాట్​ చేశారు.

అవినీతికి తావు లేకుండా, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో సముల మార్పులకు తీసుకొస్తున్నామని, ఇందులో భాగంగానే ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, తప్పు చేస్తే ఎస్ఆర్వోలను ఉపేక్షించడం లేదన్నారు. ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌‌‌‌ను రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో లాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదని, ఒకవేళ రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బులు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు.

మార్కెట్ విలువలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయండి

రాష్ట్రంలో సవరించిన భూముల కనీస విలువల వివరాలను మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ.2.75 లక్షలుగా, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.5 లక్షలుగా, హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలుగా, ఓఆర్ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సవరించిన విలువలపై ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే కచ్చితంగా సమీక్షిస్తామన్నారు. భూముల విలువలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800 599 4788, వాట్సాప్ నంబర్: 82476 19983లను సంప్రదించవచ్చని సూచించారు.

ఏ శాఖ ఇచ్చినా పనిచేస్త

మంత్రుల శాఖల మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా స్పందించారు. ‘‘నాకు ఏ శాఖ ఇచ్చినా కళ్లు మూసుకుని (మనస్ఫూర్తిగా) పనిచేస్తాను. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరిగే ఏ పని చేయడానికైనా తాను భయపడను’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేసే వ్యక్తిని కాను. ఏ ఫైల్ పైనా గుడ్డిగా సంతకం పెట్టలేదు, చట్టప్రకారమే పనిచేస్తున్నా’’ అని తేల్చిచెప్పారు.

రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడి, ఏసీబీకి ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ జరపకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేస్తూ మూడు, నాలుగు సంవత్సరాల పాటు ఫైళ్లను తొక్కిపెట్టారని ఆరోపించారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు 3,500 ఫైళ్లను క్లియర్ చేశానన్నారు.

గత ప్రభుత్వ హయాంలో శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు10 ఏళ్లు గడిచినా కనీసం జవాబులు ఇవ్వలేదని, ప్రశ్నలు అడిగిన సభ్యుల పదవీకాలం కూడా ముగిసిపోయిందని, ఇటీవల తానే ఆ ఫైళ్లన్నింటినీ క్లియర్ చేశానని చెప్పారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడం జరిగిందన్నారు. భూముల డాక్యుమెంట్‌‌‌‌ను డిజిటలైజేషన్ చేస్తామని మంత్రి ప్రకటించారు.

ఇందిరమ్మ ఇళ్లతో ఎంతో తృప్తి కలిగింది

మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతమైందని పొంగులేటి సంతోషం వ్యక్తం చేశారు. పేదల సొంత ఇంటి కలను తీర్చే అవకాశం తనకు దక్కడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా వెనుకకు తగ్గలేదని, దాని ఫలితమే ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మినీ మ్యారేజ్ హాళ్లు, క్రెచ్‌‌‌‌లు 

ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని, స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత (ఇంటిగ్రేటెడ్) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు  పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి.. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ నిర్మాణ రంగ సంస్థలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడు నుంచి ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని చెప్పారు.

నిర్మిస్తున్న సంస్థలకే ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగిస్తున్నామన్నారు. ఈ నయా భవనాలలో వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజ్ హాల్, గర్భిణీలకు, వృద్ధులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియా, మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్ (బాలల సంరక్షణ కేంద్రం), వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించామని, గచ్చిబౌలిలో నిర్మిస్తున్న భవనాన్ని డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో కోహెడలో కూడా శంకుస్థాపన చేయబోతున్నామని, రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామని చెప్పారు.