ఎన్నికల్లో పోలింగ్ బూత్ లో ఓటు వేయటానికి ఓటరు కార్డు ఉంటే సరిపోదు.. ప్యాంట్ ఉండాలి.. లుంగీతో పోలింగ్ బూత్ కు వస్తే ఓటు వేయనివ్వరా.. ఓటు వేయటానికి ప్యాంట్ ఉండాల్సిందేనా.. పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ లో.. పోలింగ్ బూతుల దగ్గర CRPF సిబ్బంది ఎందుకు ఇలాంటి రూల్ పెట్టారు.. ఎందుకీ ఆంక్షలు అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గోబర్దంగా ప్రాంతంలని కుచులియా గ్రామం. అక్కడ ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు అధికారులు. 78 ఏళ్ల దిషార్ అలీ మోండల్ అనే వృద్ధుడు ఓటు వేయటానికి వచ్చాడు. CRPF సిబ్బంది అడ్డుకున్నారు. ప్యాంట్ వేసుకుని రండీ.. లుంగీతో ఉంటే ఓటు వేయటానికి లేదు అని చెప్పారు. కొత్త నిబంధన ఏంటీ.. నేను 30 ఏళ్లుగా లుంగీతోనే ఉంటున్నాను.. నా దగ్గర ప్యాంటు లేదు అని చెప్పినా వినకుండా పోలింగ్ బూత్ నుంచి పంపించివేశారు భద్రతా సిబ్బంది.
మరో ఓటర్ పేరు గణేష్ మజుందార్.. అతని వయస్సు 80 ఏళ్లు. లుంగీతో పోలింగ్ బూత్ కు వచ్చాడు ఆ వృద్ధుడు. క్యూలో నిలబడ్డాడు. భద్రతా సిబ్బంది పక్కకు పిలిచి.. లుంగీతో ఉంటే ఓటు వేయనీయం.. ప్యాంట్ వేసుకుని రండి అని వెనక్కి పంపించారు.
ఆ ఏరియాలోని చాలా పోలింగ్ బూతుల్లో వృద్ధులు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారని.. కారణం ఏంటీ అనేది ఎవరూ చెప్పటం లేదంటూ టీఎంసీ పార్టీ సభ్యులు చెబుతున్నారు. లుంగీతో వస్తే ఓటు లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్లో ఇలాంటి ఆంక్షలు ఏమీ లేవని స్పష్టం చేస్తున్నాయి. మరి అక్కడ CRPF సిబ్బంది ఎందుకు ఇలాంటి ఆంక్షలు అమలు చేశారు అనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు.

