హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లకు రెండు నెలల నుంచి కిరాయి పైసలు ఇస్తలేదు. సంస్థ దగ్గర పైసల్లేవని, వస్తున్న సొమ్ము డీజిల్‌కు, టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లకే సరిపోతున్నయని పెద్దాఫీసర్లు చెప్తున్నరు. సర్కారు నుంచి సొమ్ములొస్తెనే అద్దె బస్సులకు కిరాయి కడ్తమని అంటున్నరు. ఈ తీరుతోని బస్సుల ఓనర్లు లబోదిబోమని మొత్తుకుంటున్నరు. లోన్లు తీసుకుని ఆర్టీసీకి బస్సులు పెట్టినమని, వాటి ఈఎంఐలు ఎట్ల కట్టాలె అని, డ్రైవర్లకు జీతాలు ఎట్ల ఇయ్యాలె అని బాధపడుతున్నరు. కిరాయి పైసలు ఇయ్యకుంటె బస్సులు నడిపే పరిస్థితి లేదంటున్నరు. దీనిపై ఇప్పటికే ఆయా ఆర్టీసీ రీజియన్లలో ఆర్‌ఎంలకు లెటర్లూ ఇచ్చిండ్రు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సరిగా బస్సులు తిరగక జనం ఇబ్బందిపడుతున్నరు. ఇప్పుడు అద్దె బస్సులు ఆగిపోతే ఆగమాగమైతదని ఆందోళన కనిపిస్తున్నది.
40 కోట్ల దాకా బకాయిలు!
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 10,460 బస్సులను తిప్పుతోంది. అందులో 8,357 ఆర్టీసీ సొంత బస్సులు, 2,103 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సులకు కిలోమీటర్‌కు ఇంతని రేటు కట్టిస్తరు. ఒక్కో బస్సుకు నెలకు రూ.లక్ష వరకు బిల్లు అవుతుంది. సాధారణంగా నెలనెలా అద్దె బస్సుల ఓనర్లకు డబ్బులు చెల్లిస్తరు. గత నెల ఐదో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వం, ఆర్టీసీ విజ్ఞప్తి మేరకు అద్దె బస్సులు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు వాటికి డబ్బులు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 70 శాతం పైసలే ఇచ్చారు. అక్టోబర్ లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మొత్తంగా అన్ని అద్దె బస్సులకు కలిపి రూ. 45 కోట్ల దాకా చెల్లించాల్సి ఉందని ఓనర్ల అసోసియేషన్ నేతలు చెప్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై ఎటూ తేలకుండా ఉండటంతో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోన్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నం
రెండు నెలలుగా కిరాయి పైసలు రాకపోవడంతో ఓనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అద్దె బస్సుల ఓనర్లలో చాలా మంది లోన్లు తీసుకుని వాటిని కొన్నారు. ఆర్టీసీ నుంచి నెలనెలా బిల్లులు వస్తాయని, రెగ్యులర్‌గా ఈఎంఐలు కడతామని భావించారు. ఇప్పుడు బిల్లులు ఆగిపోవడంతో మూడు నెలలుగా ఈఎంఐలు కట్టలేదని, ఫైనాన్షియర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని ఓనర్లు వాపోతున్నారు. డ్రైవర్లకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమ్మెకు ముందు అద్దె బస్సులకు ఆర్టీసీనే డీజిల్ పోయించేది. కానీ సమ్మె మొదలయ్యాక ఓనర్లే డీజిల్ పోయించుకోవాలంటూ అదనంగా నాలుగు వేలు ఇస్తోంది. ఆ సొమ్ము సరిపోవడం లేదని, అదనంగా మరో మూడు వేల దాకా ఖర్చవుతోందని ఓనర్లు వాపోతున్నరు.
ఇటు డ్రైవర్లంతా అటు పోతున్నరు
సమ్మె నేపథ్యంలో బస్సులను ఆర్టీసీ టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకుంది. డ్రైవర్లకు రోజుకు రూ.1,500 వరకు చెల్లిస్తోంది. అదే అద్దె బస్సుల ఓనర్లు డ్రైవర్లకు సగటున రోజుకు ఏడెనిమిది వందలే ఇస్తున్నారు. దీంతో చాలా మంది అద్దె బస్సుల డ్రైవర్లు.. ఆర్టీసీలో టెంపరరీ డ్రైవర్‌గా చేరడానికి వచ్చారు. దీనిపై ఓనర్లు లబోదిబోమంటున్నరు. అద్దె బస్సులకు డ్రైవర్లు దొరకడం లేదని, దొరికినా ఎక్కువ డబ్బులు అడుగుతున్నరని, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో టెంపరరీగా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు మొర పెట్టుకుంటున్నరు.
కిరాయి ఇయ్యకుంటె నడిపేదెట్ల
కిరాయి పైసలు చెల్లించకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఓనర్లు ఆర్టీసీ దృష్టికి తీసుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొందరు ఓనర్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కిరాయి సొమ్ము ఇవ్వాలని, లేకుంటే బస్సులను నడిపే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. ఈ మేరకు ఆర్‌ఎంలకు లెటర్లు ఇచ్చారు. ఓనర్లు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను అడిగితే.. ‘‘సంస్థ దగ్గర డబ్బుల్లేవ్.. వచ్చినవన్నీ డీజిల్, తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లకే సరిపోతున్నయి.. ప్రభుత్వం నుంచి వస్తెనే మీకు ఇస్తం’’ అంటున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ ఇప్పటికే కార్మికులకు జీతాలిచ్చేందుకు పైసల్లేవని హైకోర్టుకు విన్నవించింది. అలాంటిది అద్దె బస్సులకు చెల్లిస్తారా, లేదా, చెల్లించకపోతే పరిస్థితి ఏమిటి అన్నది తేలడం లేదు.
