మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ను రద్దు చేసింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈ విధానాన్ని రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అన్ని విద్యా సంస్థల్లోనూ ముస్లిం 5 శాతం రిజర్వేషన్లను తొలగిస్తున్నట్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం సామాజిక వర్గానికి కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను ఉపసంహరించుకుంటూ తాజాగా కొత్త జీవో జారీ చేసింది. 2014 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ.. ప్రస్తుత న్యాయపరమైన పరిస్థితులు, గత కోర్టు తీర్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా సుమారు 11.5 శాతంగా ఉంది. ఈ సామాజిక వర్గం ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉందనే అంశాన్ని గతంలో పలు కమిటీలు లెక్కలతో సహా వివరించాయి. దీంతో 2004లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ, 2006లో జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ ముస్లింల స్థితిగతులపై నివేదికలు ఇచ్చాయి. అనంతరం 2009లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్ మెహమూదుర్ రెహ్మాన్ కమిటీ, ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది.
2014 నాటి ఆర్డినెన్స్..
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 50 ముస్లిం ఉప కులాలను స్పెషల్ బ్యాక్‌వర్డ్ కేటగిరీ-A కింద చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడం, కోర్టు తీర్పుల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు.. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం దశాబ్ద కాలంగా రాజకీయ, న్యాయ పోరాటాల మధ్య నలుగుతోంది. తాజా జీవోతో గతంలో అమలులోకి తీసుకురాబడిన 5 శాతం కోటా అధికారికంగా ఇకపై నిలిచిపోనుంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
