కొత్త మండలాల్లో ఆఫీసులకూ దిక్కులేదు!

కొత్త మండలాల్లో ఆఫీసులకూ దిక్కులేదు!

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిర్గా పూర్ మండలంలో తహసీల్దార్ ఆఫీసు అద్దె బిల్డింగ్ లో కొనసాగుతోంది. కిరాయి కట్ట లేదని ఓనర్ నర్సమ్మ ఈ నెల 20న ఆఫీసు కు తాళం వేసింది. నెలకు రూ.6 వేల చొప్పు న రూ.2.34 లక్షలు కిరాయి ఇవ్వాల్సి ఉండ గా కేవలం రూ. లక్ష మాత్రమే చెల్లించారు. కిరాయి అడిగితే ఆఫీసర్లు స్పందించక పోవడంతో ఓనర్ ఆఫీసుకు తాళం వేసింది. దాదాపు రెండు గంటలపాటు ఆఫీసర్లు, సిబ్బంది, పనుల కోసం వచ్చిన ప్రజలు బయటే  నిలబడ్డారు. 15 రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లిస్తామని ఆర్డీఓ విక్టర్ హామీ ఇవ్వడంతో తాళం తీశారు. 

వెలుగు, నెట్​వర్క్​/ఆసిఫాబాద్​: రాష్ట్రంలో కొత్తమండలాలు ఏర్పడి ఐదేండ్లు గడిచిపోయాయి. కానీ మెజారిటీ మండలాల్లో కొత్తగా ఎలాంటి ఆఫీసులు కట్టలేదు. తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్​స్టేషన్​లాంటి మూడు, నాలుగు ఆఫీసులను కూడా అద్దె బిల్డింగుల్లో అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు. నలుగురు వస్తే కూర్చునేందుకు నాలుగు కుర్చీలు కూడా వేయలేని పరిస్థితిలో చాలా భవనాలున్నాయి. కొన్ని మండలాల్లోనైతే  మండల పరిషత్, అగ్రికల్చర్, విద్యుత్, మండల విద్యావనరుల కేంద్రం తదితర ఆఫీసులను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఆఫీసులే లేనప్పుడు కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఏం ఫాయిదా అని పబ్లిక్​ అడుగుతున్నారు. కాగా, ఏండ్ల తరబడి రెంట్​కట్టకపోవడంతో ఇటీవల ఆయా మండలాఫీసులకు ఓనర్లు తాళాలేస్తున్నారు. దీంతో అటు ఉద్యోగులు, ఇటు వివిధ అవసరాల కోసం వచ్చే  ప్రజలు​తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అద్దె బిల్డింగులు, స్కూళ్లలో ప్రభుత్వ ఆఫీసులు 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 460 రెవెన్యూ మండలాలు ఉండేవి. 2016 అక్టోబర్​లో 125 కొత్త మండలాలను, ఆ తర్వాత ఇప్పటివరకు వివిధ దఫాల్లో కొత్తగా మరో 8 మండలాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మండలాల సంఖ్య 593కు చేరింది. కొత్త మండలాలైతే ఏర్పాటు చేశారుగానీ చాలాచోట్ల ఇంతవరకు ఆఫీసులు నిర్మించలేదు. మండలాల ఏర్పాటు సమయంలో హడావిడిగా అద్దె భవనాల్లో తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మమ అనిపించారు. కొన్నిచోట్ల అద్దె భవనాలు కూడా దొరక్క స్కూళ్లలో ఏర్పాటుచేయగా, ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నాయి. గడిచిన ఐదేండ్లుగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి, పెంచికల్ పేట్ మండలాల్లో మండల పరిషత్, తహసీల్దార్​ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు స్కూళ్లలోనే నడుస్తున్నాయి. ఆఫీసులకు, పోలీసుస్టేషన్లకు వచ్చే పబ్లిక్​వల్ల స్కూళ్లల్లో స్టూడెంట్స్​ఇబ్బంది పడుతున్నారు.

పాత మండలాల నుంచే పాలన  

కొత్త మండలాల్లోని ఆఫీసుల్లో చాలా శాఖలకు రెగ్యులర్​ఆఫీసర్లను నియమించలేదు. ఉమ్మడి మండలానికి చెందిన ఆఫీసర్లనే కొత్తగా ఏర్పడిన మండలాలకు ఇన్​చార్జిలుగా నియమించడం వల్ల వాళ్లు అక్కడి నుంచే పని చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నుంచి దూల్మిట్ట మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. కిరాయి ఇంట్లో తహసీల్దార్ ఆఫీసు ప్రారంభించారు. మద్దూరు ఎంపీడీఓనే ఇన్​చార్జి కావడంతో అక్కడి నుంచే దూల్మిట్ట ఎంపీడీఓ ఆఫీసును  నిర్వహిస్తున్నారు. దూల్మిట్ట మండలమైనా అన్ని పనులు మద్దూరు కేంద్రం నుంచే సాగుతున్నాయి.  భూపాలపల్లి జిల్లాలో కొత్తగా పలిమెల మండలం ఏర్పడింది. ఇక్కడ అన్ని ఆఫీసులకు కలిపి  బిల్డింగ్ కట్టినప్పటికీ నెట్​వర్క్ లేదంటూ పాత మండల కేంద్రం మహదేవ్​పూర్​లోనే అన్ని ఆఫీసులను నిర్వహిస్తున్నారు. పలిమెల పోలీస్ స్టేషన్ ను మేడిగడ్డలో ఏర్పాటు చేశారు. పలిమెల పేరుకే మండల కేంద్రంగా ఉంది. చాలాచోట్ల ఇలాంటి సమస్యలున్నాయి. 

  •  మెదక్​ జిల్లాలో హవేలి ఘనపూర్, నిజాంపేట, చిలప్​చెడ్, మనోహరాబాద్, నార్సింగి, మాసాయిపేట  కొత్తగా మండలాలయ్యాయి. వీటిలో ఎక్కడా తహసీల్దార్, ఎంపీడీఓ, అగ్రికల్చర్​ ఆఫీస్, పోలీస్​స్టేషన్​లకు సొంత బిల్డింగ్​లు లేవు. కిరాయి బిల్డింగులలో సౌకర్యాల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
  • సూర్యాపేట జిల్లా ఏర్పడ్డాక నాగారం, మద్దిరాల, పాలకీడు, అనంతగిరి, చింతలపాలెం కొత్త మండలాలుగా ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడి రెండున్నరేండ్లు దాటినా ఒక్క ఆఫీసుకు కూడా సొంత బిల్డింగ్​లేదు. చింతలపాలెంలో తహసీల్దార్, అగ్రికల్చర్, ఎంపీడీఓ ఆఫీసులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఎంపీడీఓ ఆఫీస్ లో జాగాలేక జనరల్​బాడీ మీటింగ్ వరండాలోనే నిర్వహిస్తున్నారు. ఈ ఆఫీసుకు నెలకు రూ.5 వేలు కిరాయి ఇస్తుండగా అది సరిపోవడం లేదంటూ ఓనర్ ఖాళీ చేయాలని చెప్పారు. గవర్నమెంట్​స్కూలులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి.. స్కూల్ ని మరోచోటకు తరలించారు. పాలకీడు మండలంలోని అన్ని ఆఫీసులు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మద్దిరాల తహసీల్దారు ఆఫీసుకు కిరాయి కట్టకపోవడంతో ఖాళీ చేయించారు. ప్రస్తుతం వేరే బిల్డింగ్ లో రన్ చేస్తున్నారు. అనంతగిరిలో తహసీల్దార్ ఆఫీసును గవర్నమెంట్​ స్కూలులో, ఎంపీడీవో ఆఫీసును గతంలో ఉన్న లైబ్రరీలో నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్, అగ్రికల్చర్ ఆఫీసులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. నాగారం మండలంలో ఆఫీసులన్నీ ఒకే ప్రాంగణంలో నిర్మించాలని స్థలం కోసం రెండేళ్లుగా వెతుకుతున్నారు.
  • కరీంనగర్ జిల్లాలో కొత్తగా గన్నేరువరం, ఇల్లందకుంట మండలాలను ఏర్పాటు చేశారు. కొత్త బిల్డింగులు కట్టకపోవడంతో అద్దె భవనాల్లోనే ఆఫీసులు కొనసాగుతున్నాయి.
  • జనగామ జిల్లాలో కొత్తగా చిల్పూర్ మండలం ఏర్పడింది. కమ్యూనిటీ హాల్స్​లో, అద్దె భవనాలలో ప్రభుత్వ ఆఫీసులను నిర్వహిస్తున్నారు.  
  • మహబూబాబాద్ జిల్లాలో 2016 అక్టోబర్ 11న  పెద్ద వంగర, గంగారం, దంతాలపల్లి, చిన్నగూడూరు కేంద్రాలుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఈ మండలాల్లో ఆఫీసులన్నీ కిరాయి ఇండ్లలోనే ఉన్నాయి. దంతాలపల్లిలో  ఎంపీడీవో ఆఫీసు రెంట్ ఏడాది నుంచి కట్టడంలేదు. లోకల్ లీడర్లు ఇంటి ఓనర్ తో మాట్లాడి మేనేజ్​ చేస్తున్నారు.    
  • మంచిర్యాల జిల్లాలో కొత్త మండలమైన  కన్నెపల్లి ఎంపీడీఓ ఆఫీస్ ప్రైవేట్ బిల్డింగ్ లో ఉంది ఇక్కడికి వచ్చే ప్రజలకు కనీసం టాయిలెట్లు కూడా లేవు. తహసీల్దార్ ఆఫీసును స్కూల్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసినా అక్కడా సౌకర్యాలు లేవు. 
  • నిర్మల్​ జిల్లాలో కొత్తగా నర్సాపూర్ జి, పెంబి, దస్తురాబాద్, సోన్​ మండలాలు ఏర్పడ్డాయి. ఎక్కడా కొత్త భవనాలు నిర్మించలేదు. పాత, అద్దె భవనాల్లో ఆఫీసులు నడుస్తున్నాయి. 
  • కామారెడ్డి జిల్లాలో కొత్తగా బీబీపేట, రామారెడ్డి, రాజంపేట, పెద్దకొడప్​గల్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎక్కడా ఆఫీసులకు  కొత్త బిల్డింగ్స్ కట్టలేదు. సొసైటీ, పీహెచ్​సీ బిల్డింగ్​లలో కొనసాగిస్తున్నారు. 
  • నిజామాబాద్​ జిల్లాలో కొత్తగా ఎర్గట్ల, మెండోరా, ముప్కాల్ మండలాలు ఏర్పడ్డాయి. ఎర్గట్ల మండలం లో ఎంపీడిఓ, పోలీస్ స్టేషన్లను స్కూల్ బిల్డింగుల్లో ఏర్పాటు చేశారు. తహసీల్దార్​  ఆఫీసును కిరాయి బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. మెండోరా హాస్పిటల్ బిల్డింగ్ లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ముప్కాల్ లో అన్ని ఆఫీసులు రెంటెడ్​ బిల్డింగుల్లోనే ఉన్నాయి. 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ఏర్పడ్డాయి. ఈ మండలాల్లో ఆఫీసులు స్కూల్ బిల్డింగ్స్, ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి. గదులు సరిపడా లేక  ఇబ్బంది కలుగుతోంది. 

మూడేండ్లుగా కిరాయి వస్తలేదు

ఐదేండ్ల కింద మా బిల్డింగ్​తహసీల్దార్​ఆఫీస్ కు కిరాయికి ఇచ్చినం. నెలకు రూ. 5,100 కిరాయి ఇస్తమన్నారు. 2016 అక్టోబర్​నుంచి 56 నెలలకుగాను మొత్తం రూ.2,85,600 రావాలి. రూ.1,65,895 మాత్రమే ఇచ్చారు. కిరాయి ఇవ్వాలని జనవరిలో, మళ్లీ జూన్ లో తహసీల్దార్​కు లెటర్ ఇచ్చాను. ఆఫీసర్లు కోరినట్టు బిల్డింగ్​ మీద మరో ఫ్లోర్​ కట్టి ఇచ్చినం. ఈ మేరకు కిరాయి రెన్యువల్​చేయాలని జులై లో కలెక్టర్ కు లెటర్​ ఇచ్చినం. అయినా కిరాయి రెన్యువల్​ చేయలేదు. బకాయిలు ఇయ్యలేదు. 
- పల్వట్ల లక్ష్మి, బిల్డింగ్ ఓనర్, చిలప్ చెడ్, మెదక్