కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 కాళేశ్వరం, మిషన్ భగీరథలో  కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు  :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాక వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు.  మన దేశంలో పెన్షన్ విధానాన్ని చూసి చైనాలో ప్రారంభించారని తెలిపారు. కాసిపేట్ మండలం దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ మీటింగ్ లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

అప్పుల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన వ్యక్తి కాక  వెంకటస్వామి అని చెప్పారు వివేక్.  సింగరేణిలో కాక  లక్ష ఉద్యోగాలను కాపాడారని తెలిపారు.  సొంత కొడుకు ఫ్యాక్టరీలో కార్మికుల హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తి కాక అని గుర్తుచేశారు.  కాక కుటుంబం ఎప్పుడు సేవ చేయడం కోసమే ఉంటుందని చెప్పుకొచ్చారు.  

బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో 23 వేల ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి.  కార్మిక నాయకుడని చెప్పుకుంటున్న కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ఏం న్యాయం చేశాడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.  తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను14 ఎంపీ సీట్లలో గెలిపించాలని కోరారు.  

తెలంగాణ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.  ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చి  యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.  కార్మికుల హక్కుల కోసం తాను పోరాడుతానన్నారు.  మీ ఇంట్లో చిన్న కొడుకుగా భావించి తనను గెలిపించాలని కోరారు.  సేవ చేసే వారిని ప్రజలు గుర్తించి గెలిపించాలన్నారు.