తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న 'పర్సంటేజీ వివాదం' ఇప్పుడు మరింత ముదిరింది. ఈరోజు మే 23న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు అత్యవసరంగా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. నిర్మాతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. థియేటర్ల నిర్వహణ భారంగా మారిన తరుణంలో, తమ డిమాండ్లను తేల్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 'పర్సంటేజీ విధానం' నడుస్తుంటే, ఇక్కడ మాత్రం 'రెంటల్ సిస్టమ్' రుద్దడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే థియేటర్లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు ఇచ్చి ఏడాది దాటినా..
గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలోనే సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని ఛాంబర్ కమిటీ హామీ ఇచ్చిందని, కానీ ఏడాది దాటినా ఎలాంటి పురోగతి లేదని సెక్రటరీ శ్రీధర్ మండిపడ్డారు. రాబోయే 'పెద్ది' సినిమా నుంచి తమకు కచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓటీటీల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాతలకు లాభాలు.. ఎగ్జిబిటర్లకు నష్టాలు..
ఒకప్పుడు థియేటర్లకు మంచి రెవెన్యూ ఉండేదని, కానీ ఇప్పుడు తెలంగాణలో దాదాపు 120 మంది థియేటర్ల ఓనర్లు దీనస్థితిలో ఉన్నారని బాలగోవింద్ రాజ్ పేర్కొన్నారు. నిర్మాతలకు థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ ఇలా 14 రకాలుగా ఆదాయం వస్తోందని, కానీ ఎగ్జిబిటర్లు మాత్రం జీఎస్టీ, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ భారంతో నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఇకపై పర్సెంటేజ్ సిస్టమ్ ప్రకటిస్తేనే సినిమాలు ఆడిస్తామని, లేదంటే థియేటర్లు మూసుకోవడమేనని ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
►ALSO READ | RamCharan: 'పెద్ది'లో సెన్సార్ కీలక మార్పులు.. 3 గంటలకు పైగా రన్ టైమ్.. 'చికిరి చికిరి' సాంగ్‌లో ఆ లిరిక్స్ చేంజ్!
