- జనగామ, యాదాద్రి జిల్లాల్లో రూ. 74.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
జనగామ/యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కనురెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మంగళవారం రూ. 74.62 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్హయాంలో డిస్కంలకు నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేశారని, ఆ బకాయిలను క్లియర్ చేస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రతినెల రూ.14 వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తున్నామని భట్టి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన దేవాదుల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటివరకూ 72 లక్షల టన్నులు వడ్లు కొన్నామని, 10.78 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 14,006 కోట్లు జమ చేశామన్నారు. ఎఫ్ సీఐ ద్వారా వడ్లు సేకరించకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, కోటి 6 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని107 స్వయం సహాయక సంఘాలకు రూ. 3. 07 కోట్లు, బ్యాంకు లింకేజ్ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ. 32 కోట్ల 89 లక్షల చెక్కులను భట్టి అందించారు.
