- కాంగ్రెస్ నుంచి 10,046 నామినేషన్లు
- బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462
- శనివారంతో ముగిసిన స్క్రూటినీ
- 3వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. గడిచిన 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం ఆఫీసర్లు శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కలిపి 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి నామినేషన్లు స్వీకరించగా, తొలిరోజు 931 మంది అభ్యర్థులు 950, రెండో రోజు 29న 7,773 మంది అభ్యర్థులు 8,332, చివరి రోజు 30వ తేదీన 13,815 మంది అభ్యర్థులు 20,460 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేసినట్లు వెల్లడించారు. వీటిలో కరీంనగర్మున్సిపల్ కార్పొరేషన్‌కు అత్యధికంగా 1,257, ఆ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్‌కు 924 నామినేషన్లు దాఖలవడం విశేషం.
కాంగ్రెస్ నుంచి అత్యధిక నామినేషన్లు
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులు అత్యధికంగా 10,046 నామినేషన్లు దాఖలు చేశారు. సగటున ఒక్కో వార్డుకు ముగ్గురి కంటే ఎక్కువ మంది పోటీపడ్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్స్ దాఖలయ్యాయి. లెఫ్ట్ పార్టీల నుంచి నామినేషన్లు చాలా తక్కువగా పడ్డాయి. ఆ పార్టీకి బలమున్న చోటే అభ్యర్థులను బరిలోకి దింపారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నుంచి 260, సీపీఐ (ఎం) నుంచి 277 నామినేషన్లను వేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఇక జనసేన పార్టీ నుంచి 342, టీడీపీ నుంచి 32 నామినేషన్లు దాఖలయ్యాయి.
జనసేన పార్టీ తరఫున జమ్మికుంటలో అత్యధికంగా 17, నల్గొండ, హుజూర్‌నగర్‌లో 14, సిరిసిల్లలో 12, సూర్యాపేటలో 11, పెద్దపల్లిలో 10 నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున మధిరలో అత్యధికంగా 9, హూజూర్‌నగర్‌లో 5, కోదాడలో 4, ఎదులాపురం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నారాయణపేట, నిజామాబాద్‌లలో 2 చొప్పున నామినేషన్లు పడ్డాయి. వైసీపీ నుంచి ఎదులాపురం మున్సిపాలిటీలో ఒకటే నామినేషన్ పడింది. మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ తరఫున ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేయడానికి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏఐఎఫ్బీ పార్టీ నుంచి 241, ఎంఐఎం పార్టీ నుంచి 576, బీఎస్పీ నుంచి 324, ఆప్ నుంచి 51 నామినేషన్లు దాఖలైనట్లుగా ఆఫీసర్లు ప్రకటించారు.
నామినేషన్ల విత్ డ్రాకు 3 వరకు అవకాశం
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా కోసం ఫిబ్రవరి 3వ తేదీ వరకు చాన్స్ ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల లోపు విత్ డ్రా ఫారాలు అందించి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకోవచ్చని తెలిపింది. శనివారం నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. ఆఫీసర్లు అఫీషియల్ డేటా వెల్లడించలేదు.
