మాకు పోస్టింగ్​ ఇవ్వండి సార్.

మాకు పోస్టింగ్​ ఇవ్వండి సార్.
  • ఎంపికైనా నాన్​లోకల్​ అంటూ ఇబ్బంది పెడుతున్రు
  • పంచాయతీ కార్యదర్శి క్యాండిడేట్ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: ‘నాన్ లోకల్’జూనియర్ పంచాయతీ కార్యదర్శి క్యాండిడేట్లు తమకు వెంటనే పోస్టింగ్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మెరిట్​ ప్రకారం తమను ఎంపిక చేసినా.. అప్లికేషన్ల సమయంలో జరిగిన పొరపాటు కారణంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం అన్యాయమని వాపోతున్నారు. నాలుగు నెలలుగా మంత్రి, సీఎస్, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశించినా కూడా కొందరికి పోస్టింగులు ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండాలని ఇటీవల సీఎం కేసీఆర్​ పేర్కొన్న నేపథ్యంలో తమకు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయాలని సర్కారు గతేడాది నిర్ణయించింది. జేఎన్టీయూ ద్వారా నియామకాలు చేపట్టింది. అప్లికేషన్లను ఆన్ లైన్ విధానంలో కాకుండా పేపర్ దరఖాస్తులను తీసుకున్నారు. కొందరు క్యాండిడేట్లు అప్లికేషన్​లోని ‘లోకల్​(స్థానికత)’కాలమ్​లో తాము నివసిస్తున్న ప్రదేశాన్ని నమోదు చేశారు. ఏప్రిల్​లో ఉద్యోగాల భర్తీ చేపట్టిన అధికారులు.. క్యాండిడేట్లు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదువుకున్న ప్రాంతాన్ని లోకల్ గా పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ఉద్యోగాలకు ఎంపికైనా కూడా సుమారు 500 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటినుంచి వారు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పలువురు క్యాండిడేట్లు హైకోర్టును ఆశ్రయించారు. అందులో కొందరికి పోస్టింగ్​ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయినా పంచాయతీరాజ్​ శాఖ స్పందించడం లేదని చెబుతున్నారు. 1,313 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాము ఉద్యోగంలో చేరేందుకు రెడీగా ఉన్నామని, అవకాశం ఇవ్వాలని నాన్ లోకల్ క్యాండిడేట్లు కోరుతున్నారు.