ఆరోగ్య సేతు యాప్ లేకుంటే కేసు బుక్ చేసుడే

ఆరోగ్య సేతు యాప్ లేకుంటే కేసు బుక్ చేసుడే
  • నోయిడా పోలీసులు తీసుకొచ్చిన కొత్త రూల్

నోయిడా : యూపీలోని నోయిడాలో గౌతమ్ బుద్ధా నగర్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోని వారిపై ఇక పోలీసులు కేస్ బుక్ చేయనున్నారు. అవును స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని ఆర్డర్ జారీ చేశారు. లేదంటే వారి పై లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా మన దగ్గర్లో కరోనా బాధితులు ఉన్నా…మన చుట్టుపక్కల కరోనా తీవ్రత ఎలా ఉందన్న విషయం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. ఐతే నోయిడా పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి యాప్ లేని వారిపై కేస్ బుక్ చేయాలని నిర్ణయించారు. రోడ్లపై వచ్చే వారిని ర్యాండమ్ గా చెక్ చేస్తామని ఆరోగ్య సేతు యాప్ వారి స్మార్ట్ ఫోన్ లో లేనట్లైతే వారిపై సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద కేసు బుక్ చేస్తామని అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) అశుతోష్ ద్వివేది చెప్పారు. మే 17 వరకు ఈ ఆర్డర్స్ అమల్లో ఉంటాయన్నారు. ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్ రెడ్ జోన్‌లో ఉంది. ఇక్కడ 34 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. దాదాపు 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.