పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బెంగాల్ కేబినెట్ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలుగా ముద్రపడిన సినీనటి అర్పితా ముఖర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి విచారిస్తోంది. ఈక్రమంలో వారు సంచలన విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇంట్లో గుట్టలు గుట్టలుగా దొరికిన నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారంతో ఏ మాత్రం సంబంధం లేదని అర్పితా ముఖర్జీ ఇప్పటికే ఈడీకి చెప్పింది. తాజాగా పార్థా ఛటర్జీ కూడా ఓ కబురు ఈడీకి చల్లగా చెప్పారట. ‘అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బుతో నాకు సంబంధం లేదు. అది నాది కానే కాదు’ అని ఆయన తేల్చి చెప్పారట. ‘ఆ డబ్బు మీది కాకుంటే.. మరెవరైనా మిమ్మల్ని ఈ కుంభకోణంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా?’ అని ఈడీ అధికారులు పార్థాను ప్రశ్నించగా.. ‘సమయం వచ్చినప్పుడు మీకే విషయమంతా తెలుస్తుంది’ అని బదులిచ్చినట్లు సమాచారం.
2016 నుంచి 2020 మధ్యకాలంలో..
అర్పితా ముఖర్జీకి చెందిన రెండు ఇళ్ల నుంచి దాదాపు రూ.50 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. 2016 నుంచి 2020 మధ్యకాలంలో బెంగాల్ విద్యాశాఖ మంత్రిగా పార్థా ఛటర్జీ వ్యవహరించారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, విద్యాసంస్థలకు అనుమతుల మంజూరులో ఆయన కుంభకోణాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. అలా అక్రమంగా సంపాదించిన డబ్బును పార్థా ఛటర్జీ.. తన సన్నిహితురాలు అర్పిత ఇళ్లలో దాచి ఉంటారని ఈడీ అనుమానిస్తోంది. అదే కోణంలో కేసు విచారణను ముందుకు తీసుకుపోతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పార్థా ఛటర్జీని పార్టీ నుంచి, మంత్రి పదవుల నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతానికి పార్థా ఏకాకిగా మిగిలినట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
