న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల ఎగుమతి, తయారీ సంస్థ అయిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. బెంగళూరులోని కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రమోటర్లకు చెందిన పలు కీలక భవనాల్లో ఈడీ మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
కంపెనీ ఆర్థిక నివేదికలు, నిధుల ప్రవాహంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని సెబీ ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ మధ్య కంపెనీ నుంచి రూ.338.90 కోట్లు మెహతా ఖాతాకు బదిలీ అయ్యాయి. అందులో రూ.232.44 కోట్లు తిరిగి వచ్చాయని సెబీ గుర్తించింది.
కంపెనీ ఒకే లావాదేవీలను పదేపదే వివిధ అనుబంధ సంస్థల ద్వారా తిప్పడం ద్వారా గత ఐదేళ్లలో ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని, కొనుగోళ్లను తప్పుగా, అదనంగా చూపించిందని సెబీ ఆరోపించింది. ఈ తప్పుడు నివేదికల వల్ల ఇన్వెస్టర్లు మోసపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కంపెనీపై ఆంక్షలు విధించింది. సెబీ నివేదిక ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద నేరాలు జరిగాయా అనే కోణంలో ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.
