- కేడర్‌ను అప్రమత్తం చేస్తున్న గులాబీ పార్టీ
- కొత్త సమీకరణాలతో చిన్న పార్టీల ఎంట్రీ
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌పై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానుండడంతో పార్టీ అధిష్ఠానాలు ముందస్తు ప్రచారానికి సిద్ధమయ్యాయి. సమావేశాలు, శిక్షణ తరగతుల పేరుతో నేతలు వరంగల్ బాట పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ సీటును నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తోంది.
నగరానికి భారీ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేస్తోంది. రూ.5,257 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.551 కోట్లతో మంచినీటి వ్యవస్థ, మామునూర్ విమానాశ్రయానికి రూ.295 కోట్లు, జీడబ్ల్యూఎంసీ పనులకు రూ.340 కోట్లు, నయీంనగర్ నాలా, బ్రిడ్జికి రూ.100 కోట్లు, భద్రకాళి మాడవీధులకు రూ.30 కోట్లు, చెరువుల పూడికతీత, సుందరీకరణకు రూ.40 కోట్లు, రెండు యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.400 కోట్లు ఇలా దాదాపు రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నగర పర్యటనలో మరిన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ కేంద్ర నేతల ఫోకస్..
2016లో ఒక్క కార్పొరేటర్‌తో ఉన్న బీజేపీ, 2021 నాటికి 10 స్థానాలకు చేరుకుంది. ఈసారి మరింత బలపడాలని కేంద్ర, రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామునూర్ విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, అమృత్ భారత్, రైల్వే ప్రాజెక్టులను ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వరంగల్‌లో పర్యటించారు. త్వరలో జాతీయ అధ్యక్షుడు, అనంతరం ప్రధాని మోదీ పర్యటన ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు.
కొత్త సమీకరణాలతో కవిత, పవన్ కల్యాణ్..
తెలంగాణ రక్షణ సేనను స్థాపించిన కల్వకుంట్ల కవిత, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తమ పార్టీని రంగంలోకి దింపాలని భావిస్తోంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వరంగల్‌పై దృష్టి సారించారు. అభిమానిని కలిసే పేరుతో ఇటీవల వరంగల్‌కు వచ్చి పార్టీ బృందాన్ని పరిచయం చేశారు. దీంతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది.
కేడర్‌ను కూడగడుతున్న బీఆర్‌ఎస్..
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు గ్రేటర్ వరంగల్‌ను గులాబీ కోటగా నిలబెట్టుకున్న బీఆర్‌ఎస్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ తదితర ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరచూ నగరంలో పర్యటిస్తూ కేడర్‌ను చైతన్యపరుస్తున్నారు.
పెళ్లిళ్లు, పరామర్శలు, జన్మదిన వేడుకలు.. ఏ సందర్భాన్ని వదలకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలుండగా, వారిని మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు వేడెక్కుతున్న రాజకీయాలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల హడావిడి కూడా వేడెక్కుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి.
అధికార పార్టీ అభివృద్ధి అజెండాను ఆయుధంగా మార్చుకుంటే, బీజేపీ కేంద్ర ప్రాజెక్టులను హైలైట్ చేస్తోంది. పూర్వవైభవాన్ని పొందేందుకు బీఆర్‌ఎస్ కేడర్‌ను రీ-యాక్టివ్ చేస్తుండగా, కొత్త రాజకీయ సమీకరణాలతో చిన్న పార్టీలూ రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఓరుగల్లులో ఎన్నికల ముంగిట రాజకీయ సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది.
