సైఫాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, చార్టర్డ్ అకౌంటెంట్ అమృత్‌కుమార్ కోటకు ప్రతిష్టాత్మక ఐపీఏ సన్మాన్ ప్రొఫిషియెన్సీ అవార్డు–2026 లభించింది. చార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో వృత్తిపరమైన ప్రతిభ, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆదివారం ఐపీఏ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఐపీఏ సన్మాన్ అవార్డ్స్ 2025–26’ కార్యక్రమాన్ని లక్డీకాపూల్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో నిర్వహించారు.
తెలంగాణ లోకాయుక్త ఎ.రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమృత్‌కుమార్ కోటకు అవార్డును అందజేశారు. పన్నుల చట్టాలు, చార్టర్డ్ అకౌంటెన్సీ రంగాల్లో ఆయన అందించిన సేవలు, వృత్తిపరమైన కృషి, అనుభవాన్ని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ట్యాక్స్ బార్ అధ్యక్షుడిగానూ ఆయన సేవలందించారు.
