- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీఎంఎస్, ఏబీకేఎంఎస్ వినతి
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన కోయగూడెం ఓసీ3, జేవీఆర్ ఓసీ3 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఏబీకేఎంఎస్-బీఎంఎస్) లీడర్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆఫీస్‌లో మంత్రిని కలిసి ఈ మేరకు రిక్వెస్ట్ చేశారు. మణుగూరు పీకేఓసీ2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కేలా చొరవ తీసుకున్నందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి యాజమాన్యాన్ని ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకుని, ప్రైవేట్ సంస్థలకు కేటాయించేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆ సంఘం జాతీయ నాయకులు మాధవ నాయక్ ఆరోపించారు.
సింగరేణికి కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పటికే ఉన్న గనుల బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయని, కొన్ని గనులు మూసివేత దశకు చేరుకోవడంతో ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ‘సింగరేణి బొగ్గు ఉత్పత్తికి పుట్టినిల్లు అయిన ఇల్లందు ప్రాంతం నేడు కొత్త గనులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఏరియాలో గనులు తగ్గిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇతర ఏరియాలకు బదిలీ చేస్తున్నారు. ఫలితంగా స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నాయి’ అని నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి..
సింగరేణి కార్మిక సంఘాల నాయకులు ఇచ్చిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కోయగూడెం, జేవీఆర్ ఓసీ బొగ్గు బ్లాకులను చట్టం అనుకూలిస్తే సింగరేణికి కేటాయించేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు అప్పానీ శ్రీనివాస్, వడ్డేపల్లి కుమార్ స్వామియాదగిరి సత్తయ్య, జీవీ కృష్ణారెడ్డి, సాయి వేణి సతీష్, లీలా కృష్ణ, సుజేందర్, నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.
