తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తగ్గిన వరద

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తగ్గిన వరద
  •     జూరాలకు 63 వేలు, శ్రీశైలానికి 1.25 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్​ఫ్లో​
  •     నారాయణపూర్​ నుంచి 23 వేల క్యూసెక్కులు దిగువకు
  •     ఎగువన వర్షాలు లేక తగ్గిన వరద.. ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ తగ్గిన నీటి నిల్వ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. నిన్నమొన్నటిదాకా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రాగా.. ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు లేకపోవడం, క్యాచ్​మెంట్ల నుంచి వరద ప్రవాహాలు రాకపోవడంతో ప్రాజెక్టులకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో​ తగ్గిపోయింది. ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 40 వేల మేరకే వరద వస్తోంది. దీంతో నారాయణపూర్​ నుంచి 23 వేలకు విడుదలను తగ్గించారు. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల కెనాల్స్​ నుంచి కర్నాటక నీటిని వాడుకుంటుండడంతో ఆ ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ వేగంగా పడిపోయింది. 

నిన్నమొన్నటి వరకు నిండుకుండల్లా ఉన్నా ఆ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గాయి. మొన్నటిదాకా ఆల్మట్టిలో 120 టీఎంసీలదాకా నీళ్లుండగా ఇప్పుడు 98 టీఎంసీలకు, నారాయణపూర్​లో 34 టీఎంసీల దాకా జలాలుండగా.. ఇప్పుడు 18 టీఎంసీలకు నిల్వ తగ్గిపోయింది. దీంతో విడుదలను తగ్గించడంతో జూరాలకు కూడా ప్రవాహం తగ్గింది. స్థానిక క్యాచ్​మెంట్​లో వస్తున్న వరదతో కలిపి ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 63 వేల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 1.25 లక్షలకు వరద తగ్గింది. గోదావరి పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు ఎల్లంపల్లికి వరదలు మెరుగ్గా రాగా.. ప్రస్తుతం డ్రైగానే ఉంది. నిజాంసాగర్​కు 6 వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్​కు 3200, ఎల్లంపల్లికి 5800 క్యూసెక్కుల మేర వరద వస్తున్నది. చెప్పుకోదగిన స్థాయిలో వరదలు రావట్లేదు. ఎగువన జైక్వాడికి కేవలం 10,523 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. 

వర్షాలు పడకుంటే కష్టమే..

రాష్ట్రంలో ఆగస్టు తొలిఅర్ధభాగంలో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉన్నా.. రెండో అర్థభాగం నుంచి మాత్రం తగ్గిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తాజా ఔట్​కమ్​లో వెల్లడించింది. అయితే, మహారాష్ట్ర పరిసరాలు, కేరళ తీరాల్లో వర్షాలు బాగా పడతాయని తెలిపింది. దీనివల్ల కృష్ణా, గోదావరి బేసిన్లకు వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో వెస్ట్​ బెంగాల్, బంగ్లాదేశ్​ తీరంలో అల్పపీడనం ఏర్పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఎగువన వర్షాలు పడకపోతే ప్రాజెక్టులు నిండుడు కష్టమేనని అధికారులు చెప్తున్నారు. 

ముఖ్యంగా నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పేలా లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు ఇంకా భారీ స్థాయిలో వరదలు మొదలు కాలేదు. శ్రీశైలానికి వరద బాగానే వస్తుందనుకుంటున్న తరుణంలోనే తగ్గిపోయాయి. ప్రాజెక్టులోని నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందిపోయి.. ఏపీ విచ్చలవిడిగా పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీని మొదలుపెట్టింది. దీంతో సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరదలు ఎప్పుడు వస్తాయన్నదని ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా కొద్ది మొత్తంలోనే వరద వస్తున్నది.