తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషిచేస్తా..సీఎం కోరినట్టే కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశా: కిషన్‌‌ రెడ్డి 

తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషిచేస్తా..సీఎం కోరినట్టే కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశా: కిషన్‌‌ రెడ్డి 
  • సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: మెట్రోపై చర్చించేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి కోరినట్టు సహచర కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ అపాయిట్‌‌మెంట్‌‌ తీసుకున్నానని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణ,  రుణ సేకరణ, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలో సీఎంతోపాటు తాను కూడా పాల్గొన్నట్టు చెప్పారు. రెండు రోజుల ఈ భేటీలు సానుకూల వాతావరణంలో సాగాయని వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో  పోస్ట్ పెట్టారు. ‘‘ అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం కోసం తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి రెండుసార్లు నాకు లేఖలు రాశారు. ఆయన కోరినట్టు  2 రోజులపాటు 2 సమావేశాలు ఏర్పాటు చేశా. సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో, మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్‌‌రెడ్డి, నేను సమావేశం అయ్యాం. సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయి. కేంద్ర కేబినెట్‌‌లో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తా’’ అని పేర్కొన్నారు.