మెట్రోపై ముందడుగు.. కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు.. కీలక నిర్ణయాలు

మెట్రోపై ముందడుగు.. కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు.. కీలక నిర్ణయాలు
  • ఫేజ్‌‌‌‌-1 లోన్​, ఫేజ్-2 విస్తర‌‌‌‌ణ‌‌‌‌కు క‌‌‌‌న్సల్టెంట్‌‌‌‌గా ఎస్‌‌‌‌బీఐ క్యాప్స్
  • స్టడీ రిపోర్ట్ ఆధారంగా భ‌‌‌‌విష్యత్ కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌
  • స‌‌‌‌మ‌‌‌‌న్వయ స‌‌‌‌భ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయూడీ స్పెష‌‌‌‌ల్ సెక్రట‌‌‌‌రీ
  • సీఎం, కేంద్ర మంత్రుల సంయుక్త స‌‌‌‌మావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ అంశంలో కీలక ముందడుగు పడింది. మెట్రో ఫేజ్‌‌‌‌–1 స్వాధీనం, ఫేజ్‌‌‌‌–2  విస్తర‌‌‌‌ణ‌‌‌‌పై ఉన్న ఆటంకాల‌‌‌‌ను తొల‌‌‌‌గించేందుకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ దిశలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్‌‌‌‌రెడ్డితో సీఎం జరిపిన రెండు రోజుల చ‌‌‌‌ర్చలు సక్సెస్​ అయినట్టు సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

సోమవారం కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రెండున్నర గంటలపాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం ఉదయం 10:50 గంటలకు  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి భేటీ అయ్యారు.

కృష్ణ మీనన్ మార్గ్‌‌‌‌లోని ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి సైతం పాల్గొన్నారు. దాదాపు అరగంటపాటు సాగిన సమావేశంలో హైద‌‌‌‌రాబాద్ మెట్రో ఫేజ్‌‌‌‌–1 వాల్యూయేష‌‌‌‌న్‌‌‌‌ (ఆస్తుల మదింపు), ఫేజ్‌‌‌‌–1 స్వాధీనానికి అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన రుణ సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు.

అలాగే మెట్రో ఫేజ్ –2 విస్తరణపైనా చర్చలు జరిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలను సీఎం కేంద్ర మంత్రుల ముందుంచారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఫేజ్– 1కు నిధుల సేకరణ, ఫేజ్ –2 విస్తరణ విషయంలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

వరుసగా రెండు రోజుల సమవేశాల్లో సీఎం, కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ప్రధానంగా హైద‌‌రాబాద్ మెట్రో ఫేజ్‌‌–1 వాల్యూయేష‌‌న్‌‌, ఫేజ్‌‌–1 స్వాధీనానికి అవ‌‌స‌‌ర‌‌మైన రుణ సేక‌‌ర‌‌ణ‌‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌‌–2 విస్తర‌‌ణ‌‌, నిర్మాణ‌‌ వ్యయం, అందుకు అవ‌‌స‌‌ర‌‌మైన  రుణ సేక‌‌ర‌‌ణ అంశాల‌‌ను అధ్యయ‌‌నం చేసేందుకు క‌‌న్సల్టెంట్‌‌ను నియ‌‌మించాల‌‌ని నిర్ణయించారు. క‌‌న్సల్టెంట్‌‌గా ఎస్‌‌బీఐ క్యాప్స్​సంస్థను ఎంపిక చేశారు.

మెట్రోకు సంబంధించిన ఆయా అంశాల‌‌పై ఎస్‌‌బీఐ క్యాప్స్​స‌‌మ‌‌గ్రంగా అధ్యయ‌‌నం చేసి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్  ఆధారంగా భ‌‌విష్యత్ కార్యాచ‌‌ర‌‌ణ చేప‌‌ట్టేందుకు అంగీకారం తెలిపారు. క‌‌న్సల్టెంట్ అధ్యయ‌‌నం స‌‌మ‌‌యంలో స‌‌మ‌‌న్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం త‌‌ర‌‌ఫున రాష్ట్ర పుర‌‌పాల‌‌క‌‌, ప‌‌ట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) స్పెషల్ సెక్రటరీ ఉండాల‌‌ని స‌‌మావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులిద్దరూ స‌‌మ‌‌న్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారని సీఎంవో వెల్లడించింది.

రేవంత్​ వినతి.. కిషన్​ రెడ్డి చొరవ 
 హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రం అడ్డుకుంటోందని కొంతకాలంగా ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి.. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి చొరవ చూపాలని ఇటీవల బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కిషన్‌‌రెడ్డి  కేంద్ర మంత్రులతో  సీఎం రేవంత్​సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తొలుత సోమ‌‌వారం రాత్రి ఢిల్లీలోని రైల్వే భవన్‌‌లో  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ  వైష్ణవ్‌‌, కేంద్ర బొగ్గు, గ‌‌నుల శాఖ మంత్రి కిష‌‌న్‌‌రెడ్డితో సమావేశమయ్యారు.

దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో మెట్రో ఫేజ్ –1 కు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌‌సీ) లోన్,  మెట్రో –2 ఫేజ్ అనుమతుల వ్యవహారంలో అడ్డంకులపైనా చర్చించారు. ఈ భేటీలో మెట్రో విస్తరణ, నిధుల సమకూర్పుపై సానుకూలత వచ్చినట్టు  సీఎం వెల్లడించారు. 

ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లేందుకు నోడల్ ఆఫీస్ గా ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కూడా చర్చించాలని  నిర్ణయించారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌తో కేంద్ర మంత్రులు ఫోన్‌‌లో మాట్లాడి, రెండోరోజు చర్చలు కొనసాగించడంతో మెట్రో విస్తరణకు దాదాపు రూట్​క్లియర్​అయిందని అధికారులు చెబుతున్నారు.