హైదరాబాద్, వెలుగు: సంక్షేమ గృహానికి తరలించిన బాలిక సంక్షేమంపై నివేదిక సమర్పించాలంటూ నల్గొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. శిశు సంరక్షణ గృహంలో ఉన్న ఇతర పిల్లల వివరాలను కూడా రెండు వారాల్లో అందజేయాలని ఆదేశించింది. జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో లేదో నివేదికలో వివరాలు సమర్పించాలంది.
2023లో దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం వెంకన్న దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది.
బాలిక అప్పగింతకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించగా అందులో లోపాలున్నట్లు గమనించింది. పిల్లల వివరాలను (సర్)లో కూడా పేర్కొనకపోవడాన్ని బెంచ్ తప్పుబట్టింది. పిల్లలకు సంబంధించి రికార్డుల నిర్వహణలో లోపాలున్నాయని, వీటన్నింటిపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 2025లో బాలికను నల్గొండలోని సంరక్షణ కమిటీకి అప్పగించినప్పటి నుంచి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంది. రికార్డులతో సహా తదుపరి విచారణకు హాజరుకావాలంటూ నల్గొండ జిల్లా బాలల సంరక్షణ అధికారికి ఉత్తర్వులిచ్చింది.
