నీట్ వద్దు! 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లివ్వాలి: సీఎం విజయ్

నీట్ వద్దు! 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లివ్వాలి: సీఎం విజయ్
  • రెండు భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • హిందీని తమపై రుద్దితే అంగీకరించబోమని వెల్లడి
  • సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్​ ఫస్ట్​ స్పీచ్

చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ- కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రద్దు చేయాల్సిందేనని తమిళనాడు సీఎం విజయ్​ అన్నారు. వైద్య విద్యలో నీట్ తీవ్ర అసమానతలను సృష్టిస్తోందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు జరగాలని ఆయన పేర్కొన్నారు. 

ప్రత్యేక కోచింగ్ సెంటర్లకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఇదే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.  అలాగే, కేంద్రం నుంచి వచ్చే త్రిభాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ.. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునేందుకు తమిళనాడుకు అనుకూలమైన ‘ద్విభాషా విధానానికే' తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. హిందీని తమపై రుద్దితే అంగీకరించబోమని హెచ్చరించారు.

మంగళవారం తమిళనాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం విజయ్ తొలిసారి ప్రసంగించారు. ‘నీట్’పై రాష్ట్ర వ్యతిరేకతను మరోసారి తేల్చిచెప్పారు. పేద, సామాన్య విద్యార్థుల పాలిట నీట్ ఒక శాపంగా మారిందన్నారు. ఇటీవల పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు, అవకతవకల నేపథ్యంలో దేశానికి నీట్ అసలు అవసరమే లేదని.. దీనిని పూర్తిగా రద్దు చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రవేశ విధానాన్నే తమ ప్రభుత్వం కూడా బలంగా నమ్ముతోందని విజయ్ స్పష్టం చేశారు.

నటుడి పార్టీగా కొట్టిపారేయకండి
టీవీకే పార్టీని ‘నటుడి పార్టీ’ అని పిలుస్తూ, తక్కువ చేసి మాట్లాడుతున్న విమర్శకులపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేము మొదట ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలపై పోరాడి.. ఆ తర్వాతే మా పార్టీని స్థాపించాము’ అని విజయ్ వ్యాఖ్యానించారు.

‘నేను నేరుగా సినిమా షూటింగ్​ సెట్​ నుంచి వచ్చి సీఎం అయ్యానని కొందరు అంటున్నారు. వారి భాషలోనే చెప్పాలంటే అది కేవలం ఒక ‘రీల్’ మాత్రమే. ఏండ్ల తరబడి క్షేత్రస్థాయిలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పునాదితోనే మా పార్టీ ఏర్పడింది’ అని ఆయన నొక్కి చెప్పారు.

కరూర్ తొక్కిసలాట విషాదాన్ని ప్రస్తావిస్తూ.. ఆ దురదృష్టకర ఘటనకు మాపై నిందలు వేశారని.. రాజకీయం చేయాల్సింది ఇలాగేనా? అని విజయ్ ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలోని వారసత్వ రాజకీయాలను ప్రస్తావిస్తూ.. తమది ఒకే కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయ విధానం కాదని, తమిళనాడులోని ప్రతి కుటుంబానికి తమ సేవలు అందిస్తామన్నారు. అదే మా పాలనా విధానమని పేర్కొంటూ ఇండైరెక్ట్​గా డీఎంకేపై విజయ్​ విమర్శలు గుప్పించారు.

సీఎం విజయ్‌‌పై ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత విమర్శలు
అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ విజయ్ పేర్కొనగా.. అది రైతులను సీఎం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అసెంబ్లీలో సీఎం చిన్న కథ చెప్పడం రైతుల గౌరవానికి పూర్తిగా వ్యతిరేకం. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ మాత్రమే తమిళనాడు మొత్తానికి తెలుసు. కాబట్టి యాక్టర్​ విజయ్.. ఇప్పటికైనా ఆ కథలను పక్కన పెట్టండి’ అని ఉదయనిధి ట్వీట్ చేశారు. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.