- హాజరైన పురపాలక శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు గురువారం హైదరాబాద్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం, పట్టణ పాలనలో సమర్ధ నిర్ణయాలు తీసుకునే దిశగా మార్గదర్శనం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లుగా మున్సిపల్ శాఖ ప్రకటించింది.
60 మందికిపైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్న అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు, చైర్ పర్సన్ల బాధ్యతలు, అధికారాలు, విధి నిర్వహణా విధానాలపై నిపుణులు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, నిధుల వినియోగం, పట్టణ అభివృద్ధి స్కీమ్స్, ప్రణాళికలపై సీనియర్ ఆఫీసర్లు అవగాహన కల్పించారు. టీకే శ్రీదేవి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేయడానికి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
