దేవాలయాల్లో ఎండోమెంట్ యాక్ట్ అమ లు చేయాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు 

దేవాలయాల్లో ఎండోమెంట్ యాక్ట్ అమ లు చేయాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌ హైదర్‌‌బస్తీలోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం ఒక ధార్మిక సంస్థేనని, కాబట్టి దాని నిర్వహణలో దేవాదాయ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయ పాలనలో ఈ నిబంధనలను విస్మరిస్తే.. దానిని నిధుల దుర్వినియోగంగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆలయ నూతన సముదాయ నిర్మాణాన్ని సవాల్‌‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రీయ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నగిళ్ల శ్రీనివాస్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ మంగళవారం విచారించారు.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్‌‌ లాయర్‌‌ వాదనలు వినిపిస్తూ.. ఆలయ నిర్వహణ కమిటీ భక్తుల నుంచి సుమారు రూ.16 కోట్లు సేకరించినప్పటికీ, ఆ నిధుల వినియోగంలో ఎలాంటి పారదర్శకత లేదని కోర్టుకు తెలిపారు. ఆలయ నిధులు, ఆస్తుల పరిరక్షణ కోసం దేవాదాయశాఖకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇంజినీరింగ్‌‌ విభాగం అనుమతులు పొందలేదని, విరాళాలపై కనీసం ఆడిట్‌‌ కూడా నిర్వహించలేదని వివరించారు.

వాదనలను పరిశీలించిన హైకోర్టు.. ఇలాంటి వివాదాస్పద అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం దేవాదాయ చట్టం కింద సంబంధిత అధికారులకే ఉంటుందని పేర్కొంది. దేవుడి విగ్రహాన్ని భూతలం నుంచి మొదటి అంతస్తుకు తరలించే ముందు స్థపతి సలహా తీసుకున్నారా.. ? కొత్త ఆలయ ప్రారంభానికి ముందు కుంభాభిషేకం వంటి శాస్త్రోక్త క్రతువులను నిర్వహించారో.. లేదో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది