అధ్యక్షా.. ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్.. తొలి ప్రసంగంలోనే దుమ్మురేపిన యంగెస్ట్ MLA మైథిలి

అధ్యక్షా.. ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్.. తొలి ప్రసంగంలోనే దుమ్మురేపిన యంగెస్ట్ MLA మైథిలి

పాట్నా: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నెలరోజుల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికై దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ ఫోక్ సింగర్, అలీ నగర్ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలోనే ఈ యంగెస్ట్ ఎమ్మెల్యే దుమ్మురేపారు. ఫస్ట్ స్పీచ్‎లోనే ఏకంగా మంత్రికి కౌంటర్ ఇచ్చి బీహార్ పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‎గా మారారు. ప్రస్తుతం బీహార్‎లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 9) అసెంబ్లీకి హాజరైన మైథిలి ఠాకూర్ ప్రశ్నోత్తరాల సమయంలో తన సొంత నియోజకవర్గం అలీ నగర్‎లోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి గురించి ప్రశ్నించారు. 

ఆసుపత్రి భవనం బాగానే ఉందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొంది. మైథిలి ప్రశ్నకు బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోలేదని.. కొన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. మంత్రి సమాధానంతో మైథిలి విభేదించారు. 

‘‘ఆసుపత్రి భవనం బానే ఉందని.. కొన్ని మరమ్మతులు మాత్రమే చేయాలని మంత్రి చెప్పారు. కానీ నేను స్వయంగా ఆసుపత్రికి వెళ్లాను. ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక చిన్న గదికే పరిమితమైంది. మంత్రి సమాధానంతో నేను సంతృప్తి చెందలేదు” అని మైథిలి వ్యాఖ్యానించింది. అధికారిక రికార్డుల్లో అంతా బాగానే ఉన్నట్లు సూచిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. 

వైద్య సిబ్బంది కొరతను కూడా ఆమె ఎత్తి చూపారు. గతంలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు ఉండగా.. ఇప్పుడు కేవలం ఆయుష్​ వైద్యులతోనే ఆసుపత్రి నడుస్తోందన్నారు. దాదాపు 40 వేల నుంచి 50వేల మందికి సేవలందిస్తున్న ఈ ప్రాంతానికి కనీసం ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలీనగర్, ఘనశ్యామ్‌పూర్ మధ్య ఉన్న ఈ ఆసుపత్రిని సరిగ్గా అప్‌గ్రేడ్ చేస్తే వేలాది మందికి మెరుగైన వైద్యం అందించవచ్చని అన్నారు. 

అధికార బీజేపీ కూటమి ఎమ్మెల్యే అయిన మైథిలి సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు మైథిలి ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే.. అధికార కూటమి ఎమ్మెల్యేలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మైథిలి వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నితీష్ కుమార్ సర్కార్ గత ఐదేండ్లలో వైద్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. అధికార కూటమి ఎమ్మెల్యే మైథిలి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని టార్గెట్ చేస్తున్నారు. 

ఎవరీ మైథిలి ఠాకూర్..?

మైథిలీ ఠాకూర్ (Maithili Thakur) బిహార్‌‌‌‌లోని మధుబని జిల్లాలోని బెనిపట్టిలో 2000లో పుట్టింది. తండ్రి పండిట్‌‌‌‌ రమేష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్ టీచర్‌‌‌‌‌‌‌‌. వాళ్లది ఒక మారుమూల గ్రామం. అక్కడ రమేష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పించేవాడు. తండ్రే కాదు ఆమె తాత కూడా సంగీత విద్వాంసుడే. తాత, నాన్నల ప్రభావం మైథిలీపై చాలా పడింది. అందుకే సంగీతం మీద ఇష్టం పెరిగింది. తండ్రి, తాతల వారసత్వం పుణికిపుచ్చుకుని ఆమె కూడా ప్రముఖ ఫోక్ సింగర్‎గా పేరు తెచ్చుకుంది. 

ఏ రాజీ జీ పాటతో మైథిలీ నేషనల్ వైడ్‎గా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే 2025లో మైథిలి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. 2025, అక్టోబర్ 14న బీజేపీలో చేరింది. 2025 నవంబర్, డిసెంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మిశ్రాపై 11 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డ్ నెలకొల్పింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో ఘనత సాధించింది.