ఫిర్యాదులు పెండింగ్‎లో ఉంటే అధికారులకు నోటీసులు: GHMC కమిషనర్ కర్ణన్

ఫిర్యాదులు పెండింగ్‎లో ఉంటే అధికారులకు నోటీసులు: GHMC కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాలాల ఆక్రమ‌ణ‌ల‌తో కాల‌నీలు, నివాస ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తుతోంద‌ని సోమవారం  ప‌లువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాల‌ ఆక్రమణతో ప్రవాహం తగ్గుతుందని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇలా హైడ్రా ప్రజావాణికి వ‌చ్చిన 29 ఫిర్యాదుల్లో ఎక్కువగా నాలాల ఆక్రమ‌ణ‌ల‌పైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ అశోక్‌కుమార్ ప‌రిశీలించారు.

ఫిర్యాదులు పెండింగ్‎లో ఉంటే నోటీసులు: కర్ణన్

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‎లో అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, కార్వాన్, శేర్లింగంపల్లి, మల్కాజి గిరి, మెహదీపట్నం సర్కిల్ అధికారులకు నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ విభాగాల్లో పెండింగ్ ఫిర్యాదులున్న అధికారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీకి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ఫిర్యాదుల విషయంలో అధికారులు కఠినంగా ఉండాలన్నారు.