నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 17వ సారి  ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి

నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 17వ సారి  ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి
  •    రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌
  •   అల్కరాజ్‌‌‌‌ ముందంజ

పారిస్‌‌‌‌: సెర్బియా టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌, మాజీ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 17వ సారి  ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 6–3, 6–2, 6–2తో యువాన్‌‌‌‌ పాబ్లో వారిల్లాస్‌‌‌‌ (పెరూ)పై గెలిచాడు. దీంతో స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ (16సార్లు క్వార్టర్‌‌‌‌ఫైనల్స్‌‌‌‌) రికార్డును జొకో బ్రేక్‌‌‌‌ చేశాడు. ఇక కెరీర్‌‌‌‌లో 22 గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌తో నడాల్‌‌‌‌తో సమానంగా ఉన్న జొకో మరో అతి పెద్ద రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. 2016, 2021లో ఫ్రెంచ్‌‌‌‌ గెలిచిన జొకో ఈసారి కూడా టైటిల్‌‌‌‌ నెగ్గితే నాలుగు మేజర్‌‌‌‌ ట్రోఫీలను కనీసం మూడుసార్లు గెలిచిన తొలి ప్లేయర్‌‌‌‌గా చరిత్ర సృష్టిస్తాడు. గంటా 57 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో వారిల్లాస్‌‌‌‌.. జొకోకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో జొకో 7 ఏస్‌‌‌‌లు సంధిస్తే, పెరూ ప్లేయర్‌‌‌‌ మూడుకే పరిమితమయ్యాడు. బలమైన ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్స్‌‌‌‌తో రెచ్చిపోయిన సెర్బియన్‌‌‌‌ 35 విన్నర్లతో ప్రత్యర్థి (15)పై స్పష్టమైన ఆధిక్యాని కనబర్చాడు. ఇక తన సర్వ్‌‌‌‌లో 80 శాతం పాయింట్లు రాబట్టిన అతను 12 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) దుమ్మురేపాడు. ఇటలీ ప్లేయర్‌‌‌‌ లోరెంజో ముసెట్టీతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో 6–3, 6–2, 6–2తో గెలిచాడు. 2 గంటలా 8 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ 6 ఏస్‌‌‌‌లు, 42 విన్నర్స్‌‌‌‌తో రెచ్చిపోయాడు. 11వ సీడ్‌‌‌‌ ఖచనోవ్‌‌‌‌ (రష్యా) 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో లోరెంజో సోంగో (ఇటలీ)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌లోకి 

అడుగుపెట్టాడు. ముచోవా ముందుకు..

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో కరోలినా ముచోవా (చెక్‌‌‌‌) 6–4, 6–3తో ఎలీనా అవనేస్యన్ (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను సాధించింది. గంటా 37 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ముచోవా బలమైన సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి చేసిన డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ను ఆసరాగా చేసుకుని ఈజీగా నెగ్గింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో పావ్లుచెంకోవా (రష్యా) 3–6, 7–6 (7/3), 6–3తో ఎలైస్‌‌‌‌ మార్టెన్స్‌‌‌‌ (బెల్జియం)పై, ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌) 6–4, 7–6 (7/5)తో డారియా కసాట్కినా (రష్యా)పై గెలిచారు. 

మియు కటోపై వేటు 

విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ సందర్భంగా జపాన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మియో కటో కొట్టిన బాల్‌‌‌‌ పొరపాటున బాల్‌‌‌‌ గర్ల్‌‌‌‌ మెడకు బలంగా తాకడంతో ఆమెపై వేటు పడింది. రాకెట్‌‌‌‌ను స్వింగ్‌‌‌‌ చేసే క్రమంలో బాల్​ ఆ అమ్మాయిని బలంగా తాకింది. ఆ టైమ్‌‌‌‌లో బాల్‌‌‌‌గర్ల్‌‌‌‌ కోర్టు వైపు తదేకంగా చూస్తుండటంతో బంతిని గమనించలేదు. ఈ వ్యవహారంలో చైర్‌‌‌‌ అంపైర్‌‌‌‌ కటోను మందలించి వదిలేశాడు. కానీ మ్యాచ్‌‌‌‌ తర్వాత దీనిపై విచారణ జరిపిన గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ సూపర్‌‌‌‌ వైజర్‌‌‌‌ వేనీ మెక్‌‌‌‌ఈవెన్‌‌‌‌ ఆమెను డిస్‌‌‌‌ క్వాలిఫై చేశాడు.