ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు గుడి

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు గుడి

అయోధ్య : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు ఓ యువకుడు గుడి కట్టించాడు. గుడిలో సీఎం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి కాషాయ వస్త్రాలు తొడిగి.. చేతిలో విల్లు, బాణం, తల చుట్టూ కాంతితో  రాముడి అవతారంలో చూపించారు. సీఎం గుడిలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. ప్రభాకర్‌‌ మౌర్య అనే యూట్యూబర్.. అయోధ్యలోని భరత్‌‌కుండ్ దగ్గర ఈ గుడిని కట్టించాడు.

ఈ ఆలయం రామ జన్మభూమి నుంచి 25 కి.మీ దూరంలో ఫైజాబాద్-ప్రయాగ్‌‌రాజ్ హైవేపై ఉంది. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నందుకే సీఎం యోగికి గుడి కట్టానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. సీఎం చేస్తున్న ప్రజాసంక్షేమ పనుల వల్లే ఆయనకు ఈ గౌరవం దక్కిందని చెప్పారు. శ్రీరాముడి కోసం చేసినట్లే ఆదిత్యనాథ్ గుడిలోనూ ప్రతిరోజూ శ్లోకాలు చదువుతానని వెల్లడించారు. తనకు ఉద్యోగం, భూమి లేదని.. యూట్యూబ్‌‌లో భజనలు,  మతపరమైన పాటలు పోస్ట్ చేసి నెలకు సుమారు రూ.లక్ష సంపాదిస్తున్నానని వివరించాడు. ఆ డబ్బుతోనే గుడి కట్టినట్లు మౌర్య తెలిపారు.