ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రూ.3 వేల కోట్లు బాకీ పడిన ప్రభుత్వం !

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రూ.3 వేల కోట్లు బాకీ పడిన ప్రభుత్వం !

అమరావతి: నేటి (ఏప్రిల్ 1) నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో నడుస్తున్న ఆరోగ్య శ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బాకీ పడటంతో.. ఈ బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు అందిస్తామని హాస్పిటల్స్ స్పష్టం చేశాయి. 

హాస్పిటల్స్కు దాదాపు రూ. 3000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, డిసెంబర్ నెలాఖరులోగా చెల్లింపులు పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, మార్చి నెలాఖరు వచ్చినా ఆ బకాయిలు ఇంకా ప్రభుత్వం చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఈ కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహణ కష్టంగా మారిందని.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడితో, రోజువారీ కార్యకలాపాలు, సిబ్బందికి జీతాలు చెల్లించడం తమకు కష్టంగా ఉందని హాస్పిటల్స్ తేల్చి చెప్పాయి. ఈ రూ.3 వేల కోట్లు చెల్లించేదాకా  ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి.

హాస్పిటల్స్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే.. హాస్పిటల్స్ ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకు కొంత ఊరటనిచ్చాయి. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రులు తెలిపాయి.