నిధులిచ్చే ఐలాండ్‌‌ ఇది !

నిధులిచ్చే ఐలాండ్‌‌ ఇది !

అనగనగా ఒక ద్వీపం. అక్కడ కొన్ని వందల ఏండ్ల క్రితం దాచిపెట్టిన పెద్ద నిధి ఉంది. ఆ నిధి వెతుక్కుంటూ కొంతమంది అక్కడికి వెళ్లారు. నిధి దొరకడం మాట అటుంచితే.. వెళ్లిన వాళ్లలో కొందరు తిరిగి రాలేదు. ఒకరిద్దరికి కొంత నిధి దొరికింది. ఇంకొందరు తమ జీవితాలను ధార పోసి వెతికినా లాభం లేకపోయింది. ఇదంతా చదువుతుంటే.. చిన్నప్పుడు విన్న కథలా అనిపిస్తుంది కదా! కానీ.. ఇది కథ కాదు నిజం. కెనడాలో భాగమైన ఓక్ ఐలాండ్‌‌లో సముద్రపు దొంగలు దాచిపెట్టిన భారీ నిధులు ఉన్నాయట! వాటిని కనుక్కునేందుకు దాదాపు 200 ఏండ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 

ఓక్ ద్వీపం కెనడాలోని నోవా స్కోటియాకు దగ్గరలో ఉంది. దీనిపై ఇప్పటివరకు 50కి పైగా పుస్తకాలు వచ్చాయి. ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు. రెండు శతాబ్దాలుగా ఈ ద్వీపంపై రీసెర్చ్‌‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే రిక్, మార్టి లగినా అనే ఇద్దరు అక్కడ తవ్వకాలు చేస్తూ ఆ వీడియోలను హిస్టరీ ఛానెల్‌‌లో డాక్యుమెంటరీగా టెలికాస్ట్ చేశారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది చూశారు. 

ముగ్గురితో మొదలు..
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఓక్ ఐల్యాండ్‌‌ గురించిన కథ 1799లో మొదలైంది. డేనియల్ మెక్‌‌గిన్నిస్, ఆంథోనీ వాఘన్, జాన్ స్మిత్ అనే ముగ్గురు యువకులు చేపలు పడుతూ ఈ ద్వీపం వైపు వెళ్లారు. వాళ్ల దగ్గరున్న పనిముట్లను శుభ్రం చేసుకోవడానికి ద్వీపంలో దిగారు. అక్కడి పరిస్థితులు వాళ్లను బాగా ఎట్రాక్ట్‌‌ చేశాయి. దాంతో ఐలాండ్‌‌ లోపలికి వెళ్లి అంతా గమనించారు. అక్కడ ఉన్న ఓక్‌‌ చెట్టు ఒకటి కాస్త వింతగా కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే దాని కింద కొన్ని బంగారు నాణేలు కనిపించాయి. దాంతో అక్కడ నిధి ఉందని డిసైడ్‌‌ అయ్యారు. ఆశతో బంగారం దొరికిన చోట తవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో వాళ్ల దగ్గరున్న పనిముట్లతో కొంత లోతు తవ్వగానే చెక్కలతో ఉన్న ఒక ఫ్లాట్‌‌ఫాం కనిపించింది. దాంతో అక్కడ ఎవరో నిధి పాతిపెట్టారనుకుని ఇంకా లోతుకి తవ్వారు. అలా ముగ్గురూ కలిసి 30 అడుగుల వరకు తవ్వారు. కానీ.. నిధి దొరకలేదు. అప్పటికే వాళ్లకు బాగా విసుగొచ్చింది. దాంతో తవ్వడం ఆపేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. అందులో ముందుగా నిధిని చూసిన డేనియల్‌‌ మాత్రం అక్కడే చనిపోయాడని కొందరు చెప్తుంటారు. వాళ్లకు నిధి దొరికింది, అందుకే తవ్వడం ఆపేసి వెళ్లిపోయారని మరికొందరు చెప్తున్నారు. అయితే.. అప్పట్లో వాళ్లు తవ్విన గొయ్యినే ఇప్పుడు ‘‘మనీ పిట్” అని పిలుస్తున్నారు. 

మళ్లీ అదే గొయ్యిలో..
కొన్ని సంవత్సరాల తర్వాత 1802లో ఆన్‌‌స్లో కంపెనీ ఐలాండ్‌‌కు వచ్చింది. అంతకుముందు డేనియల్‌‌ తన ఫ్రెండ్స్‌‌తో తవ్విన గొయ్యిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది. ఈసారి లేటెస్ట్‌‌ ఎక్విప్‌‌మెంట్స్‌‌తో వచ్చిన ఈ కంపెనీ దాదాపు 90 అడుగుల దాకా తవ్వించింది. వాళ్లకు బొగ్గు, కొబ్బరి పీచు, కొన్ని సింబల్స్ ఉన్న ఒక రాయి దొరికాయి. కానీ.. నిధి మాత్రం దొరకలేదు. అప్పటికే గొయ్యిలోకి నీళ్లు రావడంతో తవ్వడానికి వీల్లేక వదిలేశారు. ఆ తర్వాత 1849లో ‘ది ట్రూరో’ కంపెనీ ప్రపంచానికి తెలియకుండా నిధిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో రహస్యంగా తవ్వకాలు మొదలుపెట్టింది. కానీ.. ఆ గొయ్యిలో తవ్వడం సాధ్యం కాకపోవడంతో 5 బోర్ హోల్స్ వేసింది. కాకపోతే 98  అడుగుల లోతులో వాళ్లకు ఒక లోహం దొరికింది. కానీ.. అది బంగారం కాదు. దాంతో అక్కడ తవ్వడం ఆపేసి అదే ద్వీపంలో మరో చోట 109 అడుగుల గొయ్యి తవ్వారు. అందులో నుంచి కూడా నీళ్లు వచ్చాయి. ఇలా1851 వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే ట్రూరో కంపెనీ దగ్గర డబ్బు అయిపోవడంతో ప్రయత్నాలు ఆపేసింది. ఆ తర్వాత కూడా చాలామంది ప్రయత్నించారు. అయినా.. ఫలితం దక్కలేదు. అమెరికా ప్రెసిడెంట్‌‌ రూజ్‌‌వెల్ట్​ కూడా ఈ నిధి కోసం వెతికినట్టు కొందరు చెప్తుంటారు. 1909లో ఓల్డ్ గోల్డ్ సాల్వేజ్ గ్రూప్ చేసిన తవ్వకాల్లో ఆయన కూడా పాల్గొన్నాడు. అయితే.. అప్పుడాయన నిధిని కనుక్కోవడంలో సక్సెస్‌‌ కాలేదు. తర్వాత కూడా ఓక్ దీవిపై ఇంట్రెస్ట్‌‌ చూపించాడు. దాని గురించి ఎప్పుడు ఏ వార్త వచ్చినా తెలుసుకునేవాడు. 

ఇంతకీ ఆ నిధి ఎక్కడిది?
దొంగల భయంతో రాజులు, ధనవంతులు దాచుకున్న సంపద లేదా దొంగలు దోచుకున్న సంపదను ఒక సేఫ్ ప్లేస్‌‌లో గొయ్యి తీసి దాచుకునేవాళ్లు. అక్కడికి ఎవరైనా వెళ్లినా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. తర్వాత వాళ్లు చనిపోవడం, దానిగురించి ఎవరికీ తెలియకపోవడం వల్ల ఆ నిధి గురించి ఎవరికీ తెలిసేది కాదు. మన దేశంలో కూడా ఇలాంటి గుప్త నిధుల కోసం పురాతన కోటల గోడలు పగలగొట్టడం, గోతులు తవ్వడం చేస్తుంటారు చాలామంది. అలాంటి గుప్త నిధి ఓక్‌‌ ఐలాండ్‌‌లో కూడా ఉన్నట్టు నమ్ముతున్నారు. మరి అక్కడ ఎవరు దాచి పెట్టారు? అంటే.. ఒకప్పుడు సముద్ర దొంగలు నౌకల్లో ప్రయాణించే వర్తకుల నుంచి బంగారం, డబ్బు దోచుకుని ఇలా ఎవరికీ తెలియని దీవుల్లో దాచుకునేవాళ్లు. అలా ఇక్కడ కూడా కొంతమంది దొంగలు నిధులు దాచారని నమ్ముతున్నారు. సంపదతోపాటు దోచుకున్న విలువైన కళాఖండాల్ని కూడా సముద్రపు దొంగలు ఈ దీవిలో దాచారని చెప్తుంటారు. డేనియల్‌‌ తవ్వినప్పుడు అక్కడ కొంత బంగారం దొరకడంతో ఈ కథలను బలంగా నమ్మడం మొదలుపెట్టారు జనాలు. డేనియల్‌‌ తర్వాత తవ్విన వాళ్లకు అనేక అరుదైన వస్తువులు దొరికాయి. వీటి ఆధారంగా ఈ ఐల్యాండ్‌‌లో కచ్చితంగా నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు. 

అరుదైన వస్తువులు
ఐలాండ్‌‌లో తవ్వకాలు జరిపిన చాలామందికి ఏదో ఒక అరుదైన వస్తువు దొరికినట్టు చెప్తుంటారు. 1920ల చివరలో తవ్వకాలు చేసినవాళ్లలో విలియం చాపెల్ ఒకరు. తవ్వకాల్లో ఆయనకు 250 సంవత్సరాల క్రితం నాటి గొడ్డలి, ఫ్లూక్ యాంకర్ దొరికాయి. అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్‌‌ గిల్బర్ట్ హెడ్డెన్ తవ్వినప్పుడు కూడా పురాతన వస్తువులు కొన్ని దొరికాయి. అయితే.. అవన్నీ ఈ మనుషుల్లేని ద్వీపానికి ఎలా వచ్చాయి? వాటిని ఎవరు? ఎందుకు పాతిపెట్టారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు.

శాపం.. ఏడుగురు చనిపోవాలి
ఈ ఐలాండ్‌‌కి శాపం ఉందని, అక్కడికి ఎవరు వెళ్లినా చనిపోతారని లేదా అనారోగ్యం పాలవుతారని చాలామంది నమ్ముతున్నారు. అందుకే కొందరు అక్కడికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తుంటారు. మరికొందరేమో అక్కడి నిధులకు కొన్ని అతీత శక్తులు కాపలాగా ఉన్నాయని నమ్ముతున్నారు. నిధి ముట్టుకోవాలని చూస్తే అవి చంపేస్తాయని నమ్ముతారు. 1965లో రాబర్ట్ రెస్టాల్ తన 18 ఏండ్ల కొడుకుతో కలిసి నిధి కోసం ప్రయత్నించాడు. వాళ్లు 27 అడుగుల లోతు తవ్వారు. గొయ్యిలో హైడ్రోజన్ సల్ఫైడ్ రిలీజ్‌‌ కావడంతో రాబర్ట్ రెస్టాల్ స్పృహ కోల్పోయాడు. దాంతో అతన్ని కాపాడేందుకు వెళ్లిన తన కొడుకు, పనిచేసే వ్యక్తి స్పృహకోల్పోయి తర్వాత ప్రాణాలు వదిలారు. ఇలా గడిచిన వందేండ్లలో నిధి కోసం వెళ్లి ఆరుగురు చనిపోయారు. లెక్కలేనంత మంది చనిపోయారని కొందరు చెప్తుంటారు. నిధి కోసం వెళ్లిన వాళ్లు చనిపోతుండడంతో ఈ ఐలాండ్‌‌కి శాపం ఉందని నమ్ముతున్నారు. ఆ శాపం ప్రకారం నిధి కోసం వెళ్లినవాళ్లలో ఏడుగురి ప్రాణాలు పోయాక ఎనిమిదో వ్యక్తికి నిధులు దొరుకుతాయని చెప్తుంటారు.

డాక్యుమెంటరీ షో
ఏప్రిల్ 2006లో మిషిగాన్‌‌కు చెందిన అన్నదమ్ములు రిక్, మార్టి లగినా ఓక్ ఐలాండ్ టూర్స్‌‌లో 50 శాతాన్ని డేవిడ్ టోబియాస్ నుంచి కొన్నారు. అప్పటినుంచి మిషిగాన్ గ్రూప్ ఓక్ ద్వీపంలో నిధిని కనుగొని, ద్వీపం రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నిస్తోంది. అయితే... ఆ ప్రయత్నాలను హిస్టరీ ఛానెల్‌‌లో రియాలిటీ డాక్యుమెంటరీ షోగా టెలికాస్ట్‌‌ చేస్తున్నారు. 2014 నుంచి  టెలికాస్ట్‌‌ అవుతున్న ‘ది కర్స్ ఆఫ్ ఓక్ ఐలాండ్’కి చాలామంది వ్యూయర్స్‌‌ ఉన్నారు. అక్కడ కనుగొన్న రోమన్ల కత్తి, స్పానిష్‌‌ రాగి నాణెంతో సహా అనేక వస్తువులను ఈ షోలో చూపించారు.

యుద్ధాల వల్ల 
రాజులకాలంలో రాజ్యాల మధ్య ఎక్కువగా యుద్ధాలు జరుగుతుండేవి. అప్పట్లో యూరప్‌‌లో బాగా యుద్ధాలు జరగడంతో ఏదో ఒక దేశం తమ సంపదను శత్రువులు కొల్లగొట్టకుండా కాపాడుకునేందుకు ఇలా ఈ ఐలాండ్‌‌లో దాచి ఉంటుందని కొందరు ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. పైగా 1690ల్లో చాలామంది సముద్రపు దొంగలు ఈ ఓక్ ఐలాండ్‌‌ దగ్గరలో దోపిడీలు చేసినట్టు ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు.

::: కరుణాకర్​ మానెగాళ్ల