‘నైనీ’లో ఉత్పత్తి వెరీ స్లో..2026 టార్గెట్ 60 లక్షల టన్నులు.. రోజుకు 2 వేల టన్నులు దాటని ఉత్పత్తి

‘నైనీ’లో ఉత్పత్తి వెరీ స్లో..2026  టార్గెట్ 60 లక్షల టన్నులు.. రోజుకు 2 వేల టన్నులు దాటని ఉత్పత్తి

హైదరాబాద్, వెలుగు : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ లో ఉత్పత్తి స్లోగా సాగుతోంది. ఈ ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి టార్గెట్ పెట్టుకోగా.. రోజుకు 2 వేల టన్నులకు మించి జరగడం లేదు. ప్రస్తుతం అక్కడ చిన్న చిన్న ఏజెన్సీలు ఓవర్​బర్డెన్, బొగ్గు ఉత్పత్తి, సరఫరా పనులు చేస్తున్నాయని, ఈ సంస్థలతో టార్గెట్ చేరుకోవడం కష్టమన్న అభిప్రాయాలు వినిపిస్తు్న్నాయి.

350 మిలియన్​టన్నుల నిల్వలు

ఒడిశాలోని అంగూల్​జిల్లా కరోల్ బహాల్ ప్రాంతంలో నైనీ బొగ్గు బ్లాక్​ఉంది. ఇక్కడ 350 మిలియన్​టన్నుల క్వాలిటీ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు సింగరేణి, కేంద్ర సంస్థలు గుర్తించాయి. ఏటా ఐదు మిలియన్ టన్నుల బొగ్గు తవ్వినా 70 ఏండ్ల పాటు ఉత్పత్తి చేయొచ్చు. ఇక్కడ నాణ్యమైన జీ 10 రకం బొగ్గు నిల్వలున్నాయి. ఈ బ్లాక్​ను కేంద్ర బొగ్గుశాఖ 2015 ఆగస్టులో సింగరేణికి క్యాప్టివ్ మైన్‌గా కేటాయించింది. కోల్​ఇండియాతో పాటు అనేక ప్రైవేట్​కంపెనీలు పోటీపడినా సింగరేణి ఈ బ్లాక్​ను దక్కించుకుంది. అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ వెలికితీసిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్ పవర్​ప్లాంట్​కే సరఫరా చేయాలి. 

రోజుకు 2 వేల టన్నులు దాటట్లే..

నైనీ బొగ్గు బ్లాక్ లో 2025 ఏప్రిల్​నుంచి అధికారికంగా బొగ్గు ఉత్పత్తి మొదలు పెట్టగా.. డిసెంబర్​నాటికి కేవలం 80 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఏడాది 60 లక్షల టన్నులు టార్గెట్​గా నిర్దేశించారు. ఈ లెక్కన రోజుకు సుమారు 17 వేల టన్నుల ఉత్పత్తి, రవాణా జరగాలి. ఇక్కడ ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్లకు రోజుకు 2 వేల టన్నులకు మించి ఉత్పత్తి చేసే సామర్థ్యంలేదు. భారీ యంత్రాలతో ఏటా 50 లక్షల టన్నుల చొప్పున 25 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకం, ఓవర్​బర్డెన్, ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్ పనుల కోసం సింగరేణి టెండర్లు పిలవగా అవి రద్దయ్యాయి. టెండర్ల నిబంధనల్లో చిన్న లోపాన్ని సాకుగా చూపుతూ సింగరేణిపై కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఫిర్యాదులందగా.. కేంద్ర కమిటీ విచారణ కూడా జరిపింది. 

అత్యాధునిక యంత్రాలు ఉంటేనే...

ఇప్పుడున్న కాంట్రాక్టర్లతో 60 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదని, ఓపెన్‌ కాస్ట్ మైన్లలో భారీ యంత్రాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. భారీ బకెట్ కెపాసిటీ హైడ్రాలిక్ షవల్స్, 60 నుంచి 150 టన్నుల కెపాసిటీ కలిగిన డంపర్లు, ఓవర్​బర్డెన్​రిమూవల్​కోసం డ్రాగ్​లైన్లు, 150 హెచ్​పీ నుంచి 850 హెచ్​పీల సామర్థ్యం కలిగిన డోజర్లు, 150 ఎంఎం నుంచి 250 ఎంఎం లోతులో డ్రిల్లింగ్​ చేసే ఐఈఎం, అట్లాస్​కాప్​స్కో, సాండ్​విక్​ మెషీన్లు, సెలక్టివ్​ మైనింగ్​కోసం బ్లాస్టింగ్​లేకుండా కోల్​కట్టింగ్​ చేసే సర్ఫేస్​మైనర్​యంత్రాలను ఉపయోగించాల్సి ఉంటుంది. 

బొగ్గు వెలికితీసేందుకు కొత్తగా టెండర్లు పిలవడానికి సింగరేణి ఉన్నతాధికారులు మళ్లీ ఫైల్​రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఈ సారి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా నిబంధనలు రూపొందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరితం టైమ్ పట్టవచ్చని అంటున్నారు.