- ఇందుకోసం పెద్ద బ్యాంకులతో ఒప్పందాలు
- వచ్చేవారమే ఓలా క్రెడిట్ కార్డ్స్
ఓలా, ఫ్లిప్ కార్ట్ లు కొన్ని బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని క్రెడిట్ కార్డ్స్ విడుదల చేయనున్నాయి. ఫలితంగావీటికి కార్డుదారుల ఖర్చుల గురించి అవగాహన వస్తుంది కాబట్టి మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చు. క్యాబ్ ఎగ్రిగేటర్ స్టార్టప్ ఓలా ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకొని వచ్చే వారమే క్రెడిట్ కార్డ్స్ ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బెంగుళూరు: ప్రస్తుతం ఓలా సంస్థకు 1.5 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, తొలి ఏడాది పది లక్షల కార్డులు జారీ చేయనుంది. ఈ ఒప్పందం కుదిరితే రిస్క్ ఎనాలిసిస్, కార్డుల జారీ, పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్‌లైన్ మేనేజ్‌మెంట్, స్టేట్మెంట్ ప్రాసెసింగ్ వంటి పనులు ఎస్‌బీఐ చూసుకుంటుంది. మార్కెటింగ్, ప్రమోషన్స్, డిస్కౌంట్స్ వంటి బాధ్యతలను ఓలా చూసుకుంటుంది. ఈ విషయమై ఎస్‌బీఐ, ఓలాను సంప్రదించగా సమాధానం రాలేదు. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓలా అధికారి ఒకరు మాట్లాడుతూ సాధారణ క్రెడిట్‌కార్డ్స్ ఇచ్చేవాటి కంటే తాము ఎక్కువ రివార్డ్‌పాయింట్స్ ఇస్తామని, ఎక్కువ మందిని ఆకర్షించడానికే ఇలా చేస్తున్నామని వెల్లడించారు.
‘‘క్యాబ్స్‌తోపాటు చాలా రకాల సేవలను మా క్రెడిట్‌కార్డ్‌తో అందిస్తాం. రియల్‌టైం ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్, వెంటనే రివార్డులు ఇచ్చే విధానాన్ని తెస్తాం’’ అని మరో ఓలా అధికారి వివరించారు. ఓలా 2015లోనే డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఓలా మనీ ద్వారా బిల్స్ చెల్లింపులు, మొబైల్ రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలను అందిస్తోంది. తదనంతరం స్వల్పకాలిక రుణాలు ఇచ్చేందుకు ఓలా పోస్ట్‌పేడ్‌ను ప్రారంభించింది. ‘‘కస్టమర్‌ను బాగా అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్ కంపెనీలకు క్రెడిట్‌కార్డ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్లకు అప్పులివ్వాలా వద్దా అనేది సులువుగా అంచనా వేయొచ్చు’’ అని ఒక ఇన్వెస్టర్ అన్నారు.
కోబ్రాండెడ్ కార్డు అంటే..
ఏదైనా బ్యాంకు ఒక రిటైలర్, సర్వీస్ ప్రొవైడర్ అంటే డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, పెట్రో కంపెనీలు, ట్రావెల్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్ వంటి వాటితో కలిసి విడుదల చేసే కార్డును క్రోబ్రాండెడ్ క్రెడిట్‌కార్డ్ అంటారు. వీటితో సంబంధిత రిటైలర్, సర్వీస్ ప్రొవైడర్‌తో షాపింగ్ చేస్తే ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయి. రివార్డు పాయింట్ల వల్ల భవిష్యత్‌లో చేసే షాపింగ్‌కు డిస్కౌంట్లు వస్తాయి. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీ–ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు. ఈ కార్డుతో రైల్వే టికెట్లు కొంటే అదనంగా డిస్కౌంట్లు, రివార్డుపాయింట్లు ఉండవచ్చు. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు ఇలాంటి కార్డులను విడుదల చేస్తాయి.
కంపెనీల కస్టమర్ల సమాచారం బ్యాంకుల వద్ద ఉంటుంది కాబట్టి దీని సాయంతో చాలా మందికి కార్డులు, లోన్లు ఇస్తుంది. బ్రాండ్ విలువ, కస్టమర్ల సంఖ్య బాగుంటేనే బ్యాంకులు కోబ్రాండెడ్ కార్డులు జారీ చేయడానికి బ్యాంకులు అంగీకరిస్తాయి. ఈ విధానంలో రిస్క్ ఎనాలిసిస్, కార్డుల జారీ, పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్‌లైన్ మేనేజ్‌మెంట్, స్టేట్మెంట్ ప్రాసెసింగ్ వంటి పనులు బ్యాంకు చూసుకుంటుంది. మార్కెటింగ్, ప్రమోషన్స్, డిస్కౌంట్స్ వంటి బాధ్యతలను కంపెనీ చూసుకుంటుంది.
డేటా కోసమే..
ఓలా, ఫ్లిప్‌కార్ట్‌లు క్రెడిట్‌కార్డ్స్ అమ్మకాల కోసం తమ దగ్గరున్న కస్టమర్ల డేటాను ఉపయోగించుకోనున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటే క్రెడిట్ హిస్టరీ లేకున్నా కార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ఫ్లిప్‌కార్ట్ డేటా పాయింట్ల లెక్కింపు పద్ధతిని పాటిస్తోంది. వచ్చే క్వార్టర్‌లో తమ క్రెడిట్‌కార్డ్స్ జారీ చేస్తామని, ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఆక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంటామని ఫ్లిప్‌కార్ట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడానికి డేటా పాయింట్స్‌ను బ్యాంకులకు ఇస్తామని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ ఇది వరకే ‘బై నౌ పే లేటర్’ పేరిట స్వల్ప కాలిక రుణాలు కూడా ఇస్తోంది. అంటే ఏదైనా వస్తువు కొన్ని తరువాత కొంత కాలానికి డబ్బు చెల్లించవచ్చు. అయితే క్రెడిట్‌కార్డ్స్ జారీ గురించి అడిగిన ప్రశ్నలకు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందించలేదు.
గత ఏడాది అక్టోబరులో అమెజాన్, ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని కోబ్రాండ్ క్రెడిట్‌కార్డ్స్ విడుదల చేసింది. ఈ కార్డులతో అమెజాన్‌లో షాపింగ్ చేసిన వారికి అధిక రివార్డులు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. తమ కస్టమర్ల షాపింగ్ అవసరాల గురించి ఇంటర్నెట్ కంపెనీలు తెలుసుకోగలిగితే, ఏయే బ్రాండ్స్‌తో చేతులు కలపాలో అర్థమవుతుందని పీడబ్ల్యూసీకి చెందిన వివేక్ బెల్గావీ అన్నారు. క్రెడిట్‌కార్డ్ పార్ట్‌నర్‌షిప్‌ల వల్ల బ్యాంకులకు అతి తక్కువ ఖర్చుతో లక్షల మంది కస్టమర్ల వివరాలు తెస్తాయి. ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లకు మాత్రం వారి ప్లాట్‌ఫారం మినహా వేరే స్టోర్లలో క్రెడిట్‌కార్డు హోల్డర్లు ఏం కొంటున్నారో తెలియదు. ఇలాంటి వివరాలను పంచుకోవడం ద్వారా అటు బ్యాంకుకు, ఇటు ఇంటర్నెట్ కంపెనీకి మేలు జరుగుతుంది.
