- తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్వర్కర్స్ యూనియన్ ప్రకటన
ముషీరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల7వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్ల ఫోరం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఏఐటీయూసీ వెంకటేశం, బీఆర్ టీయూ నగేశ్ కుమార్, అబ్దుల్ రవూఫ్, సతీశ్ కుమార్, ఆర్కే రెడ్డి, కొండల్ రెడ్డి, బాల్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, అంకుల్ మూవర్లాంటి ఆన్లైన్యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటివరకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిపై చేయలేదన్నారు. దీంతో ఆయా కంపెనీలు డ్రైవర్ల ఆదాయాన్ని ఏకపక్షంగా తగ్గిస్తూ కమిషన్లను పెంచుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా ఇతర ఖర్చులు పూర్తిగా డ్రైవర్ మీదనే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్ లతో సంప్రదించి రవాణా సేవలకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ కిలోమీటర్ కు రూ.25 తగ్గకుండా ఫిక్స్చేయాలని, రాష్ట్రంలోకి రాకుండా ఇతర రాష్ట్ర క్యాబ్ ఆటో వాహనాలను తక్షణమే నిషేధించాలని కోరారు. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్ కు యాప్ ఆధారిత రవాణా కార్మికుల యూనియన్లు మద్దతు తెలిపి, పాల్గొనాలని పిలుపునిచ్చారు.
