- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు
హైదరాబాద్, వెలుగు: అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025 ప్రకారం కనీస బేస్ ధరలను కేంద్రం ఖరారు చేయాలని, ప్రైవేట్ వాహనాలను వాణిజ్య రవాణాకు వాడటాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబర్, ర్యాపిడో వర్కర్స్ శనివారం చేపట్టిన బ్రేక్ డౌన్ సమ్మె విజయవంతం అయింది. అగ్రిగేటర్ల ఏకపక్ష దోపిడీని అరికట్టి కార్మికులకు న్యాయం చేయాలని వర్కర్స్ డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్ వంటి యాప్ ఆధారిత రవాణా రంగ కార్మికులు నేడు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
స్తంభించిన క్యాబ్, ఆటో సేవలు
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) సంయుక్తంగా ఈ ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ నిర్వహించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమ్మె కొనసాగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్, ఆటో సేవలు నిలిచిపోయాయి.
దీంతో పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సమ్మె ఉందని ముందే జీఎంఆర్ యజమాన్యం ప్యాసింజర్లకు తెలిపింది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలైన ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయం వద్ద పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో సుమారు 2.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 1.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఈ బ్రేక్ డౌన్ లో పాల్గొన్నారు.
కనీస ధరలను ఎందుకు ఖరారు చేయట్లే
మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్-2025 అమలులోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వాలు కనీస బేస్ ధరలను ప్రకటించడంలో విఫలమవ్వడాన్ని యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం, కార్మిక సంఘాలతో సంప్రదించి తక్షణమే కనీస బేస్ ధరలను నోటిఫై చేయాలి. కంపెనీలు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ కార్మికులను దోపిడీ చేస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పడిపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
వైట్ నంబర్ ప్లేట్ (ప్రైవేట్) వాహనాలను కమర్షియల్ రవాణా కోసం వాడటాన్ని పూర్తిగా నిషేధించాలని డ్రైవర్లు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. వాటిని మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కమర్షియల్ కేటగిరీలోకి మార్చాలని కోరుతున్నారు.
కేంద్రం కనీస బేస్ ప్రైస్ ను ఖరారు చేయాలి
గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఉబర్, ఓలా, ర్యాపిడో కనీస బేస్ ధరలను ఖరారు చేయాలి. అగ్రిగేటర్ సంస్థల దోపిడీ నుంచి డ్రైవర్లను రక్షించేలా పారదర్శకమైన నిబంధనలను అమలు చేయాలి. శనివారం చేపట్టిన ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ విజయవంతం అయింది. దీంతోనైనా ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తం.
- షేక్ సలావుద్దీన్, టీజీపీడబ్ల్యూయూ ఫౌండర్ ప్రెసిడెంట్, ఐఎఫ్ఏటీ, నేషనల్ జనరల్ సెక్రటరీ
