- మృతుడి తల్లి ఫిర్యాదుతో సమాధి తవ్వి డెడ్‌బాడీ వెలికితీత
- పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
ఓల్డ్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సైఫ్ ఉల్లా(27) మృతి కేసులో ట్విస్ట్నెలకొంది. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతని సమాధిని తవ్వించి, డెడ్‌బాడీని బయటకు తీయించారు. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రక్షాపురానికి చెందిన సైఫ్ ఉల్లా గత మార్చి 31న ఇంటి వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందాడు. మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలు కనిపించాయి. అయితే అతని తల్లి ఆస్కారి భయంతోనో, మరే కారణం వల్లనో అప్పుడు మిన్నకుండి పోయింది.
తాజాగా తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సల్మాన్, అజీజ్ అనే వ్యక్తులు హత్య చేసి ఉంటారని ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌నగర్ ఏసీపీ సుఖ్ దేవ్ సింగ్, సంతోష్‌నగర్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. గురువారం బురానే షా సాహెబ్ దర్గా శ్మశానవాటికలోని సైఫ్ఉల్లా సమాధిని తవ్వించి, డెడ్‌బాడీని బయటకు తీయించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రకి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఐ సత్యనారాయణ తెలిపారు.
