ఎట్​హోంకు సీఎం, మంత్రులు డుమ్మా

ఎట్​హోంకు సీఎం, మంత్రులు డుమ్మా
  • దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్​భవన్​లో నిర్వహించిన ఎట్​హోంకు కేసీఆర్ సహా మంత్రులందరూ డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఎట్ హోంకు దూరంగా ఉన్నారు. బీజేపీ నుంచి కేవలం అధికార ప్రతినిధులు మాత్రమే అటెండ్ అయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఆ పార్టీ సీనియర్ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధులు ఎన్​వీ సుభాశ్, రచనా రెడ్డి, బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్​తదితరులు పాల్గొన్నారు. ఎట్ హోం కార్యక్రమంలో భాగంగా గవర్నర్​కు సీఎస్, డీజీపీ స్వాగతం పలికారు. తర్వాత కాసేపటికే సీఎస్ రాజ్​భవన్ నుంచి వెళ్లిపోయారు. 

బిల్లులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా
అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది ఎట్ హోం కార్యక్రమమని, వాటిపై తాను స్పందించడానికి ఇది సమయం కాదన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎట్ హోం కార్యక్రమం విషయమై తాను పుదుచ్చేరిలో ఏం మాట్లాడానో పబ్లిక్ డొమైన్​లో ఉందన్నారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారని చెప్పారు.