మహిళా క్రికెట్​ గతిని మార్చిన హైదరాబాదీ

మహిళా క్రికెట్​ గతిని మార్చిన హైదరాబాదీ

ఇండియా​ క్రికెట్​ పేరు చెప్పగానే.. టైగర్​ పటౌడీ, గుండప్ప విశ్వనాథ్​​, గావస్కర్​, కపిల్​ దేవ్‌‌‌‌, సచిన్ ​ నుంచి ఈ తరంలో విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ వరకు చాలా మంది లెజెండ్లు గుర్తొస్తారు. కానీ, అమ్మాయిల క్రికెట్​లో మేటి  ఎవరంటే మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకూ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మిథాలీ రాజ్. 

మహిళల క్రికెట్‌‌లో ఏకంగా 23 ఏండ్ల పాటు ఆడిన క్రికెటర్​..!  ఆరు వన్డే వరల్డ్​ కప్స్​లో పోటీ పడ్డ ఏకైక ప్లేయర్​..!   మహిళల వన్డే క్రికెట్‌‌లో ఎక్కువ రన్స్​.. ఎక్కువ మ్యాచ్‌‌లు.. ఎక్కువ హాఫ్​ సెంచరీలు.. కెప్టెన్​గా ఎక్కువ విజయాలు.. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు.. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో రికార్డులను కొల్లగొట్టిన ఒకే ఒక్క  మహిళా క్రికెటర్‌‌ మన మిథాలీ రాజ్‌‌!

స్మృతి మంధాన, హర్మన్‌‌ప్రీత్‌‌,  షెఫాలీ,  దీప్తి శర్మ, వస్త్రాకర్‌‌  ప్రస్తుత ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌లో కీలక ప్లేయర్లు. వీళ్లంతా బ్యాటు, బాల్‌‌ పట్టుకోవడానికి.. మరెంతో మంది అమ్మాయిలు క్రికెట్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకోవడానికి స్ఫూర్తి మన మిథాలీ రాజ్‌‌..!

1990ల్లో అమ్మాయిల క్రికెట్​ను ఎవరూ పట్టించుకోని రోజుల్లో.. సచిన్​, గంగూలీ, సెహ్వాగ్​లు తప్ప జనాలకు మరెవరూ పట్టని సమయంలో  మైదానంలోకి వచ్చిన మిథాలీ ఈ ఆటపై చెరగని ముద్ర వేసింది. అమ్మాయిల క్రికెట్​ అనగానే తన పేరే గుర్తొచ్చేలా చేసుకుంది. భాగ్యనగర గడ్డపై క్రికెట్​ ఓనమాలు నేర్చుకొని.. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు  ప్రపంచ మహిళా క్రికెట్​ను ఏలిన రాజ్​ ఇప్పుడు ఆటకు దూరమైనా..  క్రికెట్‌‌ చరిత్రలో ఆమె పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.!

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్)

విమెన్స్‌‌ క్రికెట్‌‌లో తొలి సూపర్‌‌స్టార్‌‌.  అద్భుతమైన టెక్నిక్‌‌తో అందమైన షాట్లు ఆడే పర్‌‌ఫెక్ట్ బ్యాటర్‌‌. గొప్ప కెప్టెన్. పోరాట స్ఫూర్తి కలిగిన ఫైటర్‌‌. మిథాలీ రాజ్‌‌ గురించి ఎంత చెప్పినా.. ఆమె ఆట గురించి ఎంత వర్ణించినా తక్కువే. రెండున్నర దశాబ్దాల కింద 16 ఏండ్ల వయసులో ఆడిన తొలి మ్యాచ్‌‌లోనే సెంచరీ కొట్టి ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో తన రాకను ఘనంగా చాటుకున్న మిథాలీ కాలంతో పరుగులు తీస్తూ.. తరాలు మారినా చెదరని సంకల్పంతో  అమ్మాయిల ఆటలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగింది. ఆమె కవర్‌‌ డ్రైవ్స్‌‌, బ్యాక్‌‌ఫుట్‌‌ పంచ్‌‌లు అభిమానులను ఎన్నో ఏండ్ల పాటు అలరించాయి. ఆ షాట్లను సహజ సిద్ధంగానే నేర్చుకున్న రాజ్‌‌.. గొప్ప టెక్నిక్‌‌తో ప్రత్యర్థులకు సింహస్వప్నమైంది. 

తీరని దాహం..

మెన్స్‌‌ క్రికెట్‌‌లో సచిన్‌‌ అత్యధికంగా 24 ఏండ్ల పాటు ఆడితే...  మిథాలీ  23 సంవత్సరాల పాటు కొనసాగింది. ఒక్క క్రికెట్‌‌లోనే కాదు ఏ ఆటలో అయినా ఓ మహిళ ఇన్నేళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఫిట్‌‌నెస్‌‌ కాపాడుకుంటూ, గాయాలను ఎదుర్కొంటూ రాజ్‌‌ అలవోకగా ఆడింది. పైగా, 16 ఏండ్ల వయసులో టీమ్‌‌లోకి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో.. 39 ఏండ్లు వచ్చినా కూడా ఆమె పరుగుల దాహం తీరలేదు. దేశానికి గెలిపించాలన్న తపనా తగ్గలేదు.  తనతో కలిసి ఆడిన, తన తర్వాత టీమ్‌‌లోకి వచ్చిన చాలా మంది ప్లేయర్లు ఆట నుంచి వైదొలిగినా  మిథాలీ ఇన్నేళ్లు కెరీర్‌‌ కొనసాగించిందంటే ఆటపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోచ్చు. 

విమెన్స్‌‌ క్రికెట్‌‌ ముఖచిత్రం

ఇండియా విమెన్స్‌‌ క్రికెట్‌‌లో ఇప్పుడు చాలా మంది స్టార్లున్నారు. కానీ, ఇరవై ఏండ్ల కిందట... చాలా కాలం వరకు విమెన్స్‌‌ క్రికెట్‌‌కు మిథాలీ రాజే ముఖచిత్రం. మహిళా క్రికెట్‌‌ గురించి ఏదైనా న్యూస్‌‌ వచ్చిందంటే అది మిథాలీ సాధించిన ఘనతల గురించి అయి ఉండేది. మెన్స్​ క్రికెటర్లు చార్టర్‌‌ ఫ్లైట్స్‌‌, బిజినెస్‌‌ క్లాస్‌‌ల్లో  ప్రయాణించి,  ఫైవ్‌‌ స్టార్‌‌ హోటల్స్‌‌లో బస చేస్తుంటే అమ్మాయిలు మాత్రం రైళ్లలో, విమానాల్లో ఎకానమీ క్లాస్‌‌లో ప్రయాణించేవారు. సరైన సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా మిథాలీ అంత నిలకడగా రాణించింది. ఒకదాని వెనుక మరో రికార్డు బ్రేక్‌‌ చేస్తూ  మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు  విమెన్స్‌‌ క్రికెట్‌‌ ఉనికిని కూడా కాపాడింది. 2006లో బీసీసీఐ గొడుగు కిందకు రావడంతో విమెన్స్‌‌ క్రికెట్‌‌ పరిస్థితి మారింది.  అంతకుముందు ఏడాదే వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో కెప్టెన్‌‌గా ఇండియాను తొలిసారి ఫైనల్‌‌ చేర్చడంతో జనాలకూ ఆసక్తి పెరిగింది. టీ20 ఫార్మాట్‌‌లో అడుగు పెట్టడంతో పాటు 2017లో మిథాలీ కెప్టెన్సీలోని టీమ్‌‌ మరోసారి వన్డే వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌ చేర్చడంతో పాటు ఆటకు పాపులారిటీని పెంచింది.  

ఒక్క వివాదం..

సుదీర్ఘ కెరీర్​లో  మచ్చలేని మిథాలీ రాజ్​ 2018 టీ20 వరల్డ్​ కప్​ తర్వాత ఓ వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఆ టోర్నీలో  కోచ్​ రమేశ్​ పొవార్​, బీసీసీఐ సీఓఏ మెంబర్​ డయానా ఎడుల్జీ తనను సెమీఫైనల్లో ఆడించకుండా అవమానించారని బోర్డుకు లేఖ రాయడం సంచలనం రేపింది. బ్యాటింగ్​ పొజిషన్​ను మార్చుకొమ్మంటే క్రికెట్​ నుంచి తప్పుకుంటానని మిథాలీ తనను బెదిరించిందని పొవార్​ ఆరోపించాడు. తర్వాత గొడవ చల్లారినా.. 2019లో షార్ట్‌‌ ఫార్మాట్‌‌ నుంచి మిథాలీ వైదొలగాల్సి వచ్చింది. 

ఒక్క లోటు.. 

విమెన్స్‌‌ క్రికెట్‌‌లో మిథాలీ చాలా రికార్డులు బద్దలు కొట్టింది. వరుసగా ఏడు ఫిఫ్టీలు కొట్టింది. తన చివరి టోర్నీ వరకూ నిలకడ చూపెట్టింది. మొన్నటి వన్డే వరల్డ్‌‌కప్‌‌లో టీమ్‌‌ తడబడినా తను రాణించింది. తన స్ట్రయిక్‌‌ రేట్‌‌పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌‌తోనే సమాధానం చెప్పింది. కానీ, మిగతా ప్లేయర్ల నుంచి సహకారం లేకపోవడంతో టీమ్‌‌ గ్రూప్‌‌ దశలోనే నిష్క్రమించింది. దాంతో, 2005 నుంచి 2022 వరకు రికార్డు స్థాయిలో ఆరు వన్డే వరల్డ్‌‌కప్‌‌లు ఆడినా ప్రపంచ కప్‌‌ నెగ్గాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయింది. 2005, 2017 వరల్డ్​కప్​లో ఫైనల్స్​కు వచ్చినా కప్పు అందుకోలేక పోవడం శోచనీయం. కప్పు లేకపోవడం మిథాలీ కెరీర్‌‌లో లోటే అయినా.. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ  మిథాలీ సాధించిన కీర్తి మరెవ్వరికీ సాధ్యం కాబోదు. అందరూ పొగినట్టు ఆమె ‘లేడీ సచిన్’ కాదు.. తను మిథాలీ రాజ్. విమెన్స్​ క్రికెట్​లో గ్రేటెస్ట్​ ప్లేయర్​. 

మిథాలీ రికార్డులు 

  •   విమెన్స్​ క్రికెట్​ అన్ని ఫార్మాట్లలో టాప్‌‌‌‌  స్కోరర్‌‌ (10868 రన్స్‌‌)
  •   విమెన్స్‌‌ క్రికెట్‌‌లో ఎక్కువ కాలం  ఆడిన ప్లేయర్‌‌ (22 ఏండ్ల 274 రోజులు)
  •   వన్డేల్లో ఎక్కువ రన్స్​ (7805)
  •   వన్డేల్లో ఎక్కువ హాఫ్​ సెంచరీలు  (64)
  •   వన్డేల్లో ఎక్కువ 50 ప్లస్​ స్కోర్లు (71)
  •   అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌‌‌‌‌‌ (232)
  •   కెప్టెన్‌‌‌‌గా అత్యధిక వన్డేలు  (155)
  •   వన్డేల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌‌‌‌ (89)
  •   వన్డేల్లో ఇండియా తరఫున ఎక్కువ సెంచరీలు (7)
  •   టీ20ల్లో ఇండియా తరఫున ఎక్కువ రన్స్​ (2364)
  •   టీ20ల్లో ఇండియా తరఫున ఎక్కువ ఫిఫ్టీలు  (17)
  •   టెస్టుల్లో డబుల్​ సెంచరీ చేసిన ఏకైక ఇండియన్​
  •   టీ20 క్రికెట్​లో అత్యధిక యావరేజ్ (37.52)
  •   వరల్డ్‌‌ కప్స్‌‌లో ఎక్కువ మ్యాచ్‌‌లకు కెప్టెన్‌‌ (24)
  •   వరుసగా 4 ఆసియా కప్స్‌( 2005- 2012)లో ఇండియాను విజేతగా నిలిపింది.

బద్దకం వదిలేందుకు బ్యాటు పట్టి..

చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకొని డ్యాన్సర్‌‌‌‌ అవ్వాలనుకున్న మిథాలీ రాజ్‌‌ ఎనిమిదేండ్ల వయసులో క్రికెట్‌‌లోకి అడుగుపెట్టడం వెనుక ఆసక్తికర కథ ఉంది. ఆర్మీ కుటుంబంలో పుట్టిన మిథాలీ చిన్నప్పుడు చాలా బద్దకంగా ఉండేది. ఎక్కువగా నిద్రపోయేది.  మిథాలీ బద్దకాన్ని వదిలించేందుకు ఎయిర్‌‌ఫోర్స్‌‌లో పని చేసే తండ్రి దొరై రాజ్‌‌.. ఆమె అన్న మిథున్‌‌తో కలిసి సికింద్రాబాద్‌‌ సెయింట్‌‌ జాన్స్‌‌ క్రికెట్‌‌ అకాడమీకి పంపేవాడు. చిన్నారి  మిథాలీ బౌండ్రీ దగ్గర కూర్చొని తన హోంవర్క్‌‌ చేసుకున్నాక ఒక్కోసారి బ్యాటు పట్టుకొని  కొన్ని బాల్స్‌‌ ఆడేది. అలా సరదాగా బ్యాటింగ్‌‌ చేస్తున్న తను ఓసారి కోచ్‌‌, మాజీ ఫస్ట్‌‌ క్లాస్‌‌ క్రికెటర్‌‌ జ్యోతి ప్రసాద్‌‌ కంట్లో పడింది. ఆ వయసులోనే బ్యాటింగ్‌‌ కదలికలు,  ఫుట్‌‌వర్క్‌‌ చూసిన ప్రసాద్‌‌. నాటి హైదరాబాద్‌‌ కోచ్‌‌ సంపత్‌‌ కుమార్‌‌ దగ్గరకు పంపించాడు. మిథాలీ బ్యాటింగ్‌‌ స్టయిల్‌‌ చూసి ఇంప్రెస్‌‌ అయిన సంపత్‌‌.. ‘మీ అమ్మాయిని నాకు అప్పగించండి. నన్ను గుడ్డిగా నమ్మండి. 14 ఏండ్ల వయసు వచ్చేసరికి మిథాలీని ఇండియాకు ఆడేలా చేస్తా’ అని ఆమె తండ్రి దొరైతో చెప్పాడు. అంతే..  అప్పటి నుంచి మిథాలీకి ఆటే లోకం అయింది. భరతనాట్యానికి పుల్‌‌స్టాప్‌‌ పెట్టి.. పిచ్‌‌పై బ్యాటింగ్‌‌పైనే ఫోకస్‌‌ పెట్టింది. దాంతో, అతి తక్కువ కాలంలోనే ఏజ్‌‌ గ్రూప్‌‌ క్రికెట్‌‌లో సత్తా చాటి పేరు తెచ్చుకున్న రాజ్‌‌ 1997 లో వరల్డ్‌‌ కప్‌‌ ప్రాబబుల్స్‌‌కు ఎంపికైంది. 14 ఏళ్లే కావడంతో టీమ్‌‌లోచాన్స్‌‌ రాలేదు. కానీ, రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో ఐర్లాండ్‌‌పై తొలి ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లోనే సెంచరీ కొట్టింది.2002 లో ఇంగ్లండ్​తో తొలి టెస్టులో డకౌటైనా.. అదే ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్​పైనే డబుల్​ సెంచరీ (214) కొట్టిన యంగెస్ట్​ ప్లేయర్​గా నిలిచింది. ఆపై, కెప్టెన్సీ అందుకొని టీమ్​ను విజయపథాన నడిపించిన రాజ్​ 2014లో ఇండియాకు తొలి టెస్టు విజయం( ఇంగ్లండ్​పై) అందించింది. ​వన్డే, టీ20ల్లో మరెన్నో విజయాలు, రికార్డులతో మిథాలీ సూపర్‌‌ స్టార్‌‌గా ఎదిగింది.

 మిథాలీ కెరీర్‌

  • వన్డేలు     232 :    రన్స్‌    7805
  • టీ20లు     89   :  రన్స్‌      2364
  • టెస్టులు     12  :  రన్స్‌     699

అవార్డులు, పురస్కారాలు

  • 2003 : అర్జున
  • 2015 : పద్మశ్రీ
  • 2017 : విజ్డెన్ లీడింగ్ విమెన్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్
  • 2021 : ఖేల్ రత్న

ఇండియాకు ఆడాలని చాలా కొద్ది మంది మాత్రమే కలలు గంటారు. మీరు 23 ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా అద్భుతం. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు.

‑ వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఆల్‌‌‌‌టైమ్‌‌ గ్రేట్స్‌‌లో మిథాలీ ఒకరు. విమెన్స్‌‌ క్రికెట్‌‌ అభివృద్ధిలో మిథాలీ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. ఫ్యూచర్‌‌లోనూ ఆమె ఆటతోనే సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం.

‑  ఐసీసీ సీఈవో అలార్డిస్​