- 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇండ్ల డిజైన్
- యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి వర్గాల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుం డా, వారు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను పేదల సంక్షేమం కోసం కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్ సెక్రెటరీ వి.పి. గౌతమ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2026-–27 ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లు, ఇతర ప్రాంతాలలో 2.50 లక్షలు.. మొత్తంగా 3.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చామని తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘గత ప్రభుత్వం నగరానికి 30-, 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించింది. ఉపాధికి దూరమవ్వడం, పిల్లల చదువులు, వైద్యం, రవాణా ఇబ్బందుల వల్ల పేదలు అక్కడకు వెళ్లలేకపోయారు.
ఫలితంగా ఆ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. మేం ఆ తప్పులను పున రావృతం చేయం” అని ఆయన స్పష్టం చేశారు. పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై పూర్తి హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. మహిళల పేరు మీద ఇండ్లు ఇవ్వడం వల్ల కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్యూర్ పరిధిలో నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అల్పాదాయ(ఎల్ఐజీ), మధ్యతరగతి (ఎంఐజీ) వర్గాల కోసం ఈ ఇండ్లను నిర్మి స్తామని చెప్పారు.
ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా, పేదల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూలీలు, చిన్న వ్యాపారులకు ఉపాధి దొరికే ప్రాంతాలకే సమీపంలో, మౌలిక వసతులతో ఈ గృహాల నిర్మాణం ఉండాలన్నారు.
