ఆరు రోజులుగా తలనొప్పి.. స్కాన్‌చేస్తే బుల్లెట్‌

ఆరు రోజులుగా తలనొప్పి..  స్కాన్‌చేస్తే బుల్లెట్‌

ఆ వ్యక్తికి ఆరు రోజులుగా తలనొప్పి వస్తోంది. ఎన్ని ట్లాబ్లెట్లు వేసుకుంటే ఏం లాభం, ఆ నొప్పి మాత్రం పోలేదు. ఇక, నొప్పి భరించలేక ఓ ఆస్పత్రికి వెళితే, డాక్టర్‌‌ స్కానింగ్‌‌ తీశాడు. ఓ షాకింగ్‌‌ విషయం బయటపడింది. ఆరు రోజులుగా తలలో బుల్లెట్‌‌ మోస్తున్నాడు ఆ వ్యక్తి. అవును, కొద్ది రోజుల క్రితం యూపీలోని గ్రేటర్‌‌ నోయిడాలో జరిగింది ఆ ఘటన. ఆ బుల్లెట్‌‌ ఉండడానికీ కారణముంది. ఆ కారణమేంటి? పోయిన ఆదివారం, గ్రేటర్ ​నోయిడాలో ఆరుగురు ప్రయాణిస్తున్న ఓ ఆటో ట్రాలీపైన కొందరు వ్యక్తులు బైకులపై వచ్చి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డంకౌన్ ​ప్రాంతానికి చెందిన  షరీఫ్  ఖాన్​అనే వ్యక్తి పుర్రెలోకి ఒక బుల్లెట్ ​దూసుకెళ్లింది. వెంటనే అతడిని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వాళ్లు మెడికో లీగల్ ​కేసుగా రిపోర్టు రాసి, నోయిడాలోని పెద్దాస్పత్రికి పంపారు.  నోయిడా హాస్పిటల్‌‌లో అతడికి డాక్టర్లు ఎక్స్‌‌రే  తీశారు.  రిపోర్టు కోసం మంగళవారం రావాలని చెప్పారు. మంగళవారం వస్తే అప్పటికే లేట్​అయింది మరునాడు రమ్మన్నారు. ఇంటికి వెళ్లిపోయిన షరీఫ్ ఖాన్ ​నొప్పి భరించలేక శుక్రవారం ఓ ప్రైవేట్​ డాక్టర్ ​దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. నిశితంగా పరిశీలించిన ఆ డాక్టర్ ​తలలో బుల్లెట్​ఉన్నట్లు గుర్తించారు. దీంతో షరీఫ్ ​ఖాన్ ​కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం తెలిసి, జిల్లా ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.  అప్పటికి గానీ హాస్పిటల్ ​డాక్టర్లలో కదలిక రాలేదు. హాస్పిటల్​ ఎమర్జెన్సీ మెడికల్ ​ఆఫీసర్ ​డాక్టర్​ అభిషేక్ ​త్రిపాఠి వెంటనే స్పందించారు. ఎక్స్​రే రిపోర్టును వెంటనే తెప్పించుకుని చూడగా అందులో బుల్లెట్ స్పష్టంగా కనిపించింది.  ఇదంతా రేడియాలజిస్ట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని,  బుల్లెట్​ ఉందని ఎందుకు చెప్పలేదో తాము తెలుసుకుంటామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్​కు ఏర్పాట్లు చేస్తున్నామని, షరీఫ్‌‌ ఖాన్‌‌ తలలోని బుల్లెట్‌‌ను తొలగిస్తామని వెల్లడించారు.